AP Leaders joined in BRS: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి పార్థసారథి తదితరులు పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీ అధిష్ఠానం ఏపీ సహా వివిధ రాష్ట్రాల నాయకులతో చర్చలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రశేఖర్, కిశోర్‌బాబు, పార్థసారథి తదితరులు పార్టీలో చేరేందుకు ముందుకొచ్చారు.
మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్‌గా 23 ఏళ్లపాటు పనిచేసిన చంద్రశేఖర్ ఆ పదవికి రాజీనామా చేసి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గుంటూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి, 2019లో జనసేన పార్టీ తరఫున గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా విజయం దక్కలేదు. ఏపీలోని బలమైన సామాజికవర్గానికి చెందిన ఆయనను పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షునిగా అధినేత కేసీఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
రావెల కిశోర్‌బాబు 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున విజయం సాధించి, చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమమంత్రిగా పనిచేశారు. 2019లో ఆయన జనసేన పార్టీలో చేరి అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరినా, దానికీ రాజీనామా చేశారు. చింతల పార్థసారథి ఐఆర్‌ఎస్ పదవికి రాజీనామా చేసి 2019లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వీరితోపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.
ఇవీ చదవండి: