HIGH COURT ON AMARAVATI FARMERS PADAYATRA: ఏపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. రైతుల పాదయాత్రను నిలుపుదల చేయాలని ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పాదయాత్రలో 600 మంది రైతులు పాల్గొనవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఐడీ కార్డులు ఉన్నవారే పాదయాత్రలో పాల్గొనాలన్న హైకోర్టు.. రైతులకు వెంటనే ఐడీ కార్డులు ఇవ్వాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చింది. పాదయాత్రకు సంఘీభావం తెలిపేవారు ఏ రూపంలోనైనా తెలపవచ్చని తెలిపింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాలని తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. రైతులు తిరిగి పాదయాత్ర ప్రారంభించుకోవచ్చని హైకోర్టు సూచించింది.
ఎంతమందైనా సంఘీభావం తెలపొచ్చు: పాదయాత్ర చేసేందుకు హైకోర్టు హక్కులు కల్పించిందని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. సంఘీభావం తెలిపేందుకు ఎంతమందైనా రావచ్చని.. ఏ రూపంలోనైనా తెలపవచ్చని చెప్పినట్లు వెల్లడించారు. రైతులు ఇచ్చిన భూముల్లోనే సచివాలయం, హైకోర్టు కట్టుకున్నామన్న న్యాయవాది.. పొలం, స్థలం ఉన్నవారే అమరావతి కోసం పోరాడాలా అని ప్రశ్నించారు. గో బ్యాక్ నినాదాలతో అమరావతి రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు.
తీర్పు పరిశీలించి పాదయాత్రపై నిర్ణయం: పాదయాత్రను ప్రశాంతంగా, ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా చేస్తున్నామని అమరావతి రైతులు తెలిపారు. పాదయాత్రపై కొందరు రాళ్లు, చెప్పులు వేయిస్తున్నారని మండిపడ్డారు. వీలు చూసుకుని మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. తమకు మద్దతు పెరుగుతుండటంతో తట్టుకోలేకపోతున్నారని.. ఎవరిపైనా లేని ఆంక్షలు మాపై ఎందుకు అని అమరావతి రైతులు ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు పరిశీలించి తదుపరి పాదయాత్రపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత.. భాజపా, తెరాస కార్యకర్తల మధ్య పరస్పరం దాడి
మద్యానికి బానిసైన కోతి.. వైన్ షాపులపై దాడి చేసి మరీ బాటిళ్ల చోరీ