తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ యాజమాన్యంలోని అమర్‌రాజా బ్యాటరీస్ లిమిటెడ్ కంపెనీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. పరిశ్రమను మూసివేయాలంటూ కాలుష్యనియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఈనెల 1న అమర్‌రాజా బ్యాటరీస్ పరిశమ్రకు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఈ సంస్థకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి క్లోజర్ నోటీసును జారీ చేసింది. విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని ఏపీఎస్‌పీడీసీఎల్‌కు ఆదేశాలిచ్చింది. ఈ సంస్థ పరిధిలో వివిధ విభాగాల్లో ప్రత్యక్షంగా 20 వేల మంది ఉద్యోగులు, పరోక్షంగా మరో 50వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు.
పీసీబీ ఇచ్చిన క్లోజర్ నోటీసులో ఈ సంస్థకు సంబంధించి చిత్తూరు జిల్లా నూనెగుండ్లపల్లి, కరకంబాడిల్లో ఉన్న యూనిట్లు పర్యావరణ అనుమతులు, ఆపరేషన్ నిర్వహణ సమ్మతిలో విధించిన షరతులు ఉల్లంఘించినందున వాటి మూసివేతకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. అక్కడ గాలిలో, మట్టిలో సీసం పరిమాణం నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉన్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని వివరించింది. ఆ ప్లాంట్లు ఉన్న గ్రామాల ప్రజల రక్త నమూనాలను నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ లెడ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా (ఎన్‌ఆర్‌సీఎల్‌పీఐ)లో విశ్లేషించగా... ప్రమాణాలకు మించి చాలా అధికంగా వారి రక్తంలో సీసం పరిమాణం ఉందని ప్రస్తావించింది.
కాలుష్య నియంత్రణ మండలి నోటీసులపై చట్టపరంగా ముందుకెళ్తామని అమర్‌రాజా యాజమాన్యం స్పష్టం చేసింది. బాధ్యతాయుతమైన సంస్థగా పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని... ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం సహా అన్ని విషయాల్లో అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నామంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దేశ, విదేశాల్లో అతి కీలక రంగాలైన రక్షణ, వైద్య, టెలికాం విభాగాలకు సంస్థ ఉత్పత్తులను అందజేస్తూ గత 35 ఏళ్లుగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించినట్లు యాజమాన్యం న్యాయస్థానానికి వివరించింది. పరిశ్రమకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. జూన్ 17లోపు కాలుష్య నియంత్రణ మండలి సూచనలు అమలు చేయాలని పరిశ్రమ యాజమాన్యానికి స్పష్టం చేసింది. ఈకేసు తదుపరి విచారణను జూన్ 28కి వాయిదా వేసిన హైకోర్టు... పరిశమ్రను తనిఖీ చేసి మళ్లీ నివేదిక అందించాలని పీసీబీని ఆదేశించింది.
ఇదీ చదవండి: కొవిడ్ వైద్య చికిత్సలపై హైకోర్టులో విచారణ.. సర్కార్ తీరుపై అసంతృప్తి