తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. తితిదే ఉద్యోగులు, స్థానికులకు ప్రయోగాత్మకంగా దర్శనానికి అనుమతివ్వాలని నిర్ణయించింది. భక్తులు భౌతిక దూరం పాటించాలని సూచించింది. తితిదే ఈవో రాసిన లేఖకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండున్నర నెలల తర్వాత తిరుమల శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లోకి భక్తులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో.. తిరుమలలో శ్రీవారి దర్శనాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మే 12న తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. లేఖపై స్పందించిన ప్రభుత్వం ఈ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.