నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఆయన దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపి వేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా తనను నియమించాలని హైకోర్టు ఆదేశించినా.. రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరణకు పాల్పడుతోందంటూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈనెల 17న విచారణ జరిపిన న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించినా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునరుద్ధరించాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరోవైపు హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిందిగా గవర్నర్‌ను కోరాలని నిమ్మగడ్డకు చెప్పింది. తదుపరి విచారణను కోర్టు వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. గవర్నర్‌ను కలిసిన తర్వాత జరిగిన పరిణామాలను తమ దృష్టికి తేవాలని కూడా హైకోర్టు పేర్కొంది. ఈ లోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇదీ చూడండి : 'సల్మాన్ సినిమాకు నో చెప్పినందుకు బెదిరించారు'