AP CM Jagan On Omicron: ఏపీలో ఒమిక్రాన్ వ్యాప్తిచెందకుండా ఆంక్షలు అమలుచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా పరిస్థితి, వైద్యారోగ్య శాఖపై సమీక్షించారు. వ్యాక్సినేషన్ పూర్తికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
విశాఖ, కాకినాడలో ఎంఐఆర్‌ఐ, క్యాథ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. కర్నూలులో క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అరకు, పాడేరులో అనస్తీషియా, ఈఎన్టీ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. వీటన్నింటికీ కలిపి ప్రభుత్వం సుమారు రూ.37 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. విమానాశ్రయాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. వారంలోగా జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నఅధికారులు.. ఏపీలో ఫీవర్ సర్వే కంటిన్యూ చేస్తామని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో ఈ నెలాఖరుకు 144 పీఎస్‌ఏ ప్లాంట్లు సిద్ధమవుతాయని వివరించారు.
CM Jagan On Medical Colleges: ఏపీలో కొత్త వైద్య కళాశాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆరోగ్య మిత్రలకు చరవాణులిచ్చే ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో పడకలు, వైద్యులు, సిబ్బంది సంఖ్యపై బోర్డులు ఉంచాలన్నారు. ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం ఫిబ్రవరి చివరికల్లా పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
OMICRON CASE IN AP : విజయనగరం జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు వైద్యశాఖ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. 34 ఏళ్ల యువకుడికి వేరియంట్ నిర్ధారణ అయింది. బాధితుడు ఆరోగ్యవంతంగా ఉండడం యంత్రాంగానికి ఊరటనిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన ఆ యువకుడిని కలిసిన వారికీ వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై నిఘా పెంచారు.
ఐర్లాండ్ నుంచి ముంబయి మీదుగా వచ్చిన విజయనగరం జిల్లా వాసిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఏపీలో ఇదే తొలి ఒమిక్రాన్ కేసు. 34 ఏళ్ల యువకునికి వేరియంట్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది. ఆ యువకుడు ఐర్లాండ్ నుంచి ముంబయి మీదుగా విశాఖకు వచ్చారు. విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. అతని నమూనాను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. పరీక్షల్లో ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలినట్లు ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ హైమావతి వెల్లడించారు. బాధితుడు ఆరోగ్యంగా ఉన్నారని....ఈనెల 11న మరోసారి ఆర్టీపీసీఆర్ ద్వారా పరీక్ష చేయగా నెగెటివ్ రిపోర్టు వచ్చిందని పేర్కొన్నారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. బాధితుడు ప్రథమ, ద్వితీయ కాంటాక్టులు సుమారు 40 మంది వరకు ఉన్నట్లు గుర్తించి, వారికీ పరీక్షలు చేయగా...అందరికీ నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. విదేశాల నుంచి తిరుపతికి చేరిన మరొకరికి ఇటీవల చేసిన పరీక్షలో కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆదివారమే ఖరారైంది. ఇతను ఆరోగ్యంగానే ఉన్నారని.. ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లుగా జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రజారోగ్య సంచాలకులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Krishna Water: ఏపీకి 236.13, తెలంగాణకు 170.67 టీఎంసీలు.. కృష్ణ బోర్డు ఉత్తర్వులు