'స్పందన' కార్యక్రమంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభంపై కలెక్టర్లతో మాట్లాడారు. లబ్ధిదారుడికి నేరుగా ఇంటి పట్టా అందిస్తున్నామన్న జగన్.. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జవనరి 20 వరకు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకూ 39 శాతం ఇళ్ల స్థలాలు పంపిణీ పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. పెండింగ్ కేసులను కలెక్టర్లు పరిష్కరించాలని ఆదేశించారు. పాలనలో పారదర్శకతను ఒక స్థాయికి తీసుకెళ్లామని స్పష్టం చేశారు. దరఖాస్తు పెట్టుకున్న 90 రోజుల్లో ఇళ్ల పట్టా ఇవ్వాలని స్పష్టం చేసిన జగన్... కాలనీల నిర్మాణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
టెండర్ల ప్రక్రియ పూర్తికి ఆదేశం
ప్రతి కాలనీ వెలుపల హైటెక్ రీతిలో బస్టాప్ తీర్చిదిద్దాలని... డిజైన్లు, ఇతరత్రా అంశాలపై ఇప్పటికే కొన్ని సూచనలు చేశామని ఉన్నతాధికారులకు జగన్ వివరించారు. ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారుల నుంచి ఆప్షన్లు వెంటనే తీసుకోవాలన్నారు. ఆప్షన్లు త్వరగా చేస్తేనే పనులకు కార్యాచరణ పూర్తవుతుందని తెలిపారు. ఆప్షన్ల కార్యక్రమం సైతం ఈ నెల 20కి పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మ్యాపింగ్, జియో ట్యాగింగ్ సైతం ఏకకాలంలో పూర్తి చేయాలన్నారు. పేమెంట్ల విడుదలకు ఏపీ హౌసింగ్ వెబ్‌సైట్ వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఇళ్ల నిర్మాణాల్లో నీటి సరఫరా, విద్యుత్ చాలా ముఖ్యమైన అంశాలని.... కాలనీల్లో మౌలిక సదుపాయాలపై డీపీఆర్ తయారుచేయాలని చెప్పారు. మెటీరియల్ టెండర్లను ఈనెల 20కి పూర్తిచేసేలా కలెక్టర్లే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: గ్రేటర్‌పై గెజిట్ నోటిఫికేషన్ కోసం.. భాజపా కార్పొరేటర్ల పోరు