Display Fab Investments: దేశ చరిత్రలో తొలిసారిగా డిస్‌ప్లే ఫ్యాబ్ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు దక్కాయి. రూ.24 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఎలేస్ట్ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో బెంగళూరులో జరిగిన సమావేశంలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలేస్ట్ కంపెనీ.. ఈ పెట్టుబడితో తెలంగాణలో డిస్‌ప్లే ఫ్యాబ్‌ను ఏర్పాటు చేయనుంది. దేశంలో ఫ్యాబ్ రంగంలో భారీగా పెట్టుబడి పెడుతున్న తొలి కంపెనీగా ఎలేస్ట్ చరిత్రకెక్కనుంది.
ఎలేస్ట్ కంపెనీ ప్రపంచ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన రాజేశ్ ఎక్స్‌పోర్ట్ ద్వారా ఏర్పాటు చేశారు. ఎలేస్ట్ కంపెనీ అమొలెడ్ డిస్‌ప్లే, లిథియం అయాన్ సెల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. బెంగళూరు పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సమక్షంలో రాజేశ్ ఎక్స్‌పోర్ట్ ఛైర్మన్ రాజేశ్ మెహతా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో ఆరో తరం అమోలెడ్ డిస్‌ప్లే ఫ్యాబ్ ఉత్పత్తి కోసం రూ.24 వేల కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. ఈ పెట్టుబడి ద్వారా స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు వంటి డిస్‌ప్లేలను తయారు చేయనుంది.
దేశానికే గర్వకారణం..: డిస్‌ప్లే ఫ్యాబ్ రంగంలో తెలంగాణకు రానున్న ఈ పెట్టుబడి ద్వారా కేవలం తెలంగాణను మాత్రమే కాకుండా దేశాన్ని సైతం అగ్రదేశాల సరసన నిలబెడుతుందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికే కాకుండా దేశానికి గర్వకారణమన్నారు. ఈ పెట్టుబడి తర్వాత ఫ్యాబ్ రంగంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. ఈ డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ ఈకోసిస్టం, దాని అనుబంధ రంగాల్లో వృద్ధికి గణనీయమైన అవకాశాలు లభిస్తాయని విశ్వసిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. డిస్‌ప్లే ఫ్యాబ్ రంగంలో మరిన్ని పెట్టుబడుల కోసం పోటీ పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవబోతుందన్నారు.
దేశం నుంచి ప్రపంచానికి గొప్ప ఫ్యూచర్ టెక్నాలజీ..: రాష్ట్రంలో తాము ఏర్పాటు చేయబోతున్న డిస్‌ప్లే ఫ్యాబ్‌తో ప్రపంచంలోనే అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని రాజేశ్ ఎక్స్‌పోర్ట్ ఛైర్మన్ రాజేశ్ మెహతా వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికత ఆధారంగా పని చేసే ప్లాంట్‌లో 3 వేల మంది శాస్త్రవేత్తలు, ఇతర అత్యాధునిక టెక్నాలజీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఎలేస్ట్ కంపెనీ ఆరో తరం అమోల్డ్ డిస్‌ప్లే తయారీ ద్వారా భారత దేశం నుంచి గొప్ప ఫ్యూచర్ టెక్నాలజీని ప్రపంచానికి అందించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి..:
IAS Transfers: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ
పాత టైర్లతో డైనోసర్లు, డ్రాగన్లు.. 'పంక్చర్ మ్యాన్' క్రియేటివిటీ సూపర్ గురూ!