రాష్ట్రంలో పసుపు పంట పండిస్తున్న రైతులకు రాయితీపై పసుపు పాలిషర్లు, బాయిలర్లను పంపిణీ చేయనున్నామని జాతీయ సుగంధ ద్రవ్యాల అభివృద్ధి సంస్థ - స్పైసెస్ బోర్డు ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ జి. లింగప్ప తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
యంత్రాలపై 75, 50 శాతం రాయితీ..
పసుపు పంట సాగులో నాణ్యతా ప్రమాణాలు మరింత అభివృద్ధి చేసేందుకు ముందడుగు పడిందని ఆయన అభిప్రాయ పడ్డారు. సాగు, నాణ్యత పెంపునకు అవసరమైన యంత్ర పరికరాలు, పసుపు ఉడకబెట్టే బాయిలర్లు, పసుపు పాలీషర్లు వంటివాటిపై రాయితి ఇస్తున్నామని తెలిపారు. షెల్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగల రైతు కుటుంబాలకు 75 శాతం, జనరల్ కేటగిరీ రైతులకు 50 శాతం రాయితీపై వీటిని మంజూరు చేయనున్నామని వివరించారు.
వినియోగించుకోండి..
పసుపు యంత్ర పరికరాలు కావాలనుకునే రైతులు హన్మకొండ స్పైసెస్ బోర్డు రీజినల్ కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని పేర్కొన్నారు. లేదా 0870 - 2455510 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. తెలంగాణలో పసుపు సాగులో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు, పుష్కలమైన అవకాశాలు, మార్కెటింగ్, అంతర్జాతీయ ఎగుమతి అవకాశాలు ఉన్న దృష్ట్యా... రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యాన శాఖ పసుపును ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ సదావకాశాన్ని పసుపు రైతాంగం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని లింగప్ప కోరారు.
ఇదీ చూడండి: ఎన్నికల ఏర్పాట్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయి: ఏపీ ఎస్ఈసీ