గతంలో కాంగ్రెస్ గెలిచిన ఎనిమిది ఎమ్మెల్యేలనే సీఎం కేసీఆర్ కొన్నారని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు. ఇప్పుడు బేగం బజార్ కాంగ్రెస్ అభ్యర్థి తెరాసలో చేరడం విచిత్రం ఏమి కాదన్నారు. అందరికీ డబ్బులు ఆశ చూపి లాక్కుంటున్నారని.. వారిని కూడా ఎత్తుకుపోయే సమయం త్వరలోనే వస్తుందని హెచ్చరించారు.
హిమాయత్‌నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూవ్వడి ఇందిరారావు తరపున.. అంజన్ కుమార్ రాజామోహల్లా ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. గతంలో ఓడిపోయినప్పటికీ ప్రజల సమక్షంలో ఉండి ఇందిరా రావు.. ప్రజలకు సేవా చేశారని గుర్తు చేశారు.
భాగ్యనగరం కాంగ్రెస్ హాయంలో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒక్క వర్షం పడితే నగరం మొత్తం మునిగి పోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అబద్ధపు మాటలతో ప్రజలను నమ్మించి మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజలు ప్రస్తుతం నమ్మె స్థితిలో లేరని అన్నారు. తెరాస, భాజపా, మజ్లిస్ మూడు ఒక్కటేనని.. వారిని వారే తిట్టుకుంటూ ప్రజల మధ్య గొడవలు రెచ్చగొడుతున్నారని అంజన్ మండి పడ్డారు.
ఇదీ చూడండి : తెరాస, ఎంఐఎం, భాజపా ఒక్కటే.. : ఉత్తమ్