చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచుకున్న మా పిల్లి తప్పిపోయిందంటూ ఓ జంతు ప్రేమికురాలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో... ఆచూకీ చెప్తే ఏకంగా రూ.30 వేల రివార్డు ప్రకటించారు. హైదర్గూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన బాధను పంచుకున్నారు.
హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతానికి చెందిన సెరీనా జంతు పేమికురాలు. చిన్నతనం నుంచి ఇంట్లో పలు రకాల జంతువులను పెంచుకుంటున్నారు. ఎనిమిది నెలల నుంచి జింజర్ అనే పిల్లిని పెంచుకుంటున్నారు. ఆస్పత్రిలో అదృశ్యమైందని వాపోయారు.
పిల్లికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేందుకు జూబ్లీహిల్స్‌లోని పెట్ క్లినిక్‌కు తీసుకొచ్చామని సెరీనా చెప్పారు. జూన్ 17న సర్జరీ చేయించినట్లు తెలిపారు. కుట్లు వేసిన చోట వాపు రావడంతో మళ్లీ జూన్ 23న అదే హాస్పిటల్‌కు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. జింజర్‌కి చికిత్స జరుగుతుండగా జూన్ 24న హాస్పిటల్ నుంచి పిల్లి తప్పిపోయిందంటూ... సిబ్బంది తనకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు.
ఆస్పత్రి సిబ్బందిని నిలదీయగా... వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై జూన్ 27న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా. కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. నేనే స్వయంగా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో కరపత్రాలు పంచుతున్నాను. అయినా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు.
-సెరీనా, జంతు ప్రేమికురాలు
తన పిల్లి ఆచూకీ కోసం 20 రోజులుగా గాలిస్తున్నా లాభం లేదని వాపోయారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.ముప్పై వేల రివార్డును ప్రకటించారు.
ఇదీ చదవండి: Puvvada: 'కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చాం'