పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయాలనే సంకల్పంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సనత్‌నగర్ నియోజకవర్గంలోని అంబేడ్కర్‌నగర్, జీవైఆర్ కాంపౌండ్, బండ మైసమ్మనగర్, చాచా నెహ్రూనగర్, పొట్టి శ్రీరాములునగర్, గొల్ల కొమరయ్య కాలనీల్లో 105.46 కోట్ల రూపాయల వ్యయంతో 1,258 ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. రాంగోపాల్‌పేట డివిజన్లో 330 ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టగా 80 శాతం పనులు జరిగాయని, 45 రోజుల్లో మిగిలిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
బన్సీలాల్‌పేట డివిజన్ బండ మైసమ్మనగర్‌లో 310, జీవైఆర్ కాంపౌండ్‌లో 180 ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. వీటిని వచ్చే ఏడాది మార్చి నెల నాటికి పూర్తి చేస్తామన్నారు. పొట్టి శ్రీరాములునగర్లో 15 రోజుల్లో ఇళ్లు పూర్తవుతాయని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలుంటే రెవెన్యూ, హౌసింగ్, టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్న ప్రాంతంలో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎలెక్ట్రికల్ అధికారులను ఆదేశించారు. బన్సీలాల్‌పేట డివిజన్ పరిధిలోని బర్కల బాలయ్య దొడ్డి స్థలంలో 28 కుటుంబాలు సుమారు 75 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారని.. తగు విచారణ జరిపి వారికి పొజిషన్ సర్టిఫికెట్లను ఇవ్వాలని ఆర్డీవో వసంత కుమారిని ఆదేశించారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: తెరాస, భాజపాల బాహాబాహీ..