AP DEBTS : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పులు తారాస్థాయికి చేరుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన రుణం 55 వేల కోట్ల రూపాయలు దాటింది. వివిధ కారణాలు చెప్పి సగటున రోజూ 205 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ అప్పు చేస్తోంది. ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు.. కొత్త రికార్డులు నమోదు చేసే స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిన 9 నెలల కాలానికి ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు స్థూలంగా 55 వేల 555 కోట్ల రూపాయలకు చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు త్రైమాసికాలకు గానూ రాష్ట్ర ప్రభుత్వం నెలకు సగటున చేసిన అప్పు 6 వేల172 కోట్లుగా తేలింది.
బడ్జెట్లో పేర్కొన్న రుణాలు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఇలా వివిధ మార్గాల్లో దొరికిన చోటల్లా ప్రభుత్వం అప్పులు చేసేస్తోంది. గడచిన మూడేళ్లలో రాష్ట్రప్రభుత్వం చేసిన రుణం కేవలం లక్షా 34 వేల 452 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ చెప్పుకొస్తోంది. అయితే గడిచిన 9 నెలలుగా ప్రభుత్వం చేసిన రుణం F.R.B.M. పరిమితులను మించి పోయి 55 వేల 555 కోట్లకు చేరినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల విషయాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం.. ప్రస్తుతం 2022 మార్చి నాటికి ఏపీ చేసిన రుణం 3 లక్షాల 98 వేల 903 కోట్ల రూపాయలు మాత్రమేనని చెప్పుకొస్తోంది. అయితే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ద్వారా తీసుకున్న రుణాలను బహిర్గత పరచాలని చేస్తున్న డిమాండ్ పై ప్రభుత్వం డొంకతిరుగుడు సమాధానం ఇస్తోంది. మొత్తానికి 2022-23 ఆర్ధిక సంవత్సరంలో తీసుకున్న రుణాల మొత్తం 55 వేల కోట్లకు చేరిపోవటంతో తదుపరి రుణాలు తీసుకునే అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఇవీ చదవండి: