ఆంధ్రప్రదేశ్ అప్పుల పయనం ప్రమాదకర దిశలో సాగుతున్నట్లు క్రెడిట్ రేటింగ్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన లెక్కలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రుణ-జీఎస్‌డీపీ నిష్పత్తి 34.6%కి చేరనున్నట్లు ఆ సంస్థ అంచనా వేసింది. ఇది చాలా అధికమని చెబుతోంది. ఈ నిష్పత్తి 25% వరకే ఉండాలని 14వ ఆర్థిక సంఘం నిర్దేశించింది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు అప్పులు ఎక్కువగా ఉన్నప్పటికీ రుణ-జీఎస్‌డీపీ నిష్పత్తిని లక్ష్మణ రేఖ పరిధిలోనే ఉంచుకున్నట్లు క్రెడిట్ రేటింగ్స్ సంస్థ పేర్కొంది. ఆ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రుణ-జీఎస్‌డీపీ నిష్పత్తి 21.4% ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ది అంతకంటే 13.2% అధికంగా ఉంది. పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్ (28.8%), పశ్చిమ బెంగాల్ (33.3%), రాజస్థాన్ (33.1%)లతోపాటు కేరళ (30.1%)కంటే ఆంధ్రప్రదేశ్ రుణ-జీఎస్‌డీపీ నిష్పత్తే (34.6%) అధికంగా ఉన్నట్లు రేటింగ్స్ సంస్థ వివరించింది.
భారంగా వడ్డీలు, రుణాల చెల్లింపులు
అప్పులపై వడ్డీ చెల్లింపుల భారమూ ఏపీపై అధికంగానే ఉంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 2021 ఆర్థిక సంవత్సరంలో వడ్డీల కింద 12.6%, రుణ చెల్లింపుల కింద 22.5% ఖర్చు చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మొత్తం గ్యారెంటీల పరిమాణం రూ.49,442 కోట్లకు చేరింది. తాజా లెక్కల ప్రకారం అత్యధిక రుణభారం ఉన్న రాష్ట్రంగా ఏపీ 6వ స్థానంలో నిలిచింది. 2020 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంపై రూ.3,41,270 కోట్ల రుణభారం ఉన్నట్లు క్రెడిట్ రేటింగ్స్ సంస్థ పేర్కొంది. రుణభారం పరంగా తెలంగాణ (రూ.1,68,725 కోట్లు) 14వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రుల వెనకడుగు