Blood Test for Depression: కుంగుబాటు(డిప్రెషన్)ను చాలావరకు మానసిక లక్షణాలతోనే అంచనా వేస్తుంటారు. ఇతరత్రా జబ్బుల మాదిరిగా దీన్ని గుర్తించటానికీ ఓ పరీక్ష ఉంటే? బాగుంటుంది కదా. అమెరికా శాస్త్రవేత్తలు అలాంటి ప్రయత్నమే చేశారు. రక్తంలోని ప్లేట్‌లెట్ కణాల్లో కుంగుబాటును పట్టించే జీవసూచికను గుర్తించారు. సెరటోనిన్, ఎపినెఫ్రిన్ వంటి నాడీ సమాచార వాహికలకు స్పందించటంలో భాగంగా కణాల్లో అడెనీలైల్ సైక్లేజ్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఇది కుంగుబాటు బాధితుల్లో చాలా తక్కువగా ఉంటున్నట్టు గత అధ్యయనాలు చెబుతున్నాయి. దీని ఆధారంగానే తాజా పరిశోధన కొనసాగించారు.
అడెనీలైల్ సైక్లేజ్ ఎంజైమ్ తయారీలో జీఎస్ ప్రొటీన్ పాలు పంచుకుంటుంది. ఇది కణాల్లోని కొవ్వు పొరల మధ్య చిక్కుకోవటం వల్ల అడెనీలైల్ సైక్లేజ్ ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే జీఎస్ ప్రొటీన్‌ను కొవ్వు పొరల నుంచి బయటకు రప్పించే జీవసూచిక మీద పరిశోధకులు దృష్టి సారించారు. దీన్ని రక్త పరీక్ష ద్వారా గుర్తించే అవకాశముండటం విశేషం. ఇది అందుబాటులోకి వస్తే కుంగుబాటు తీవ్రతను, మందులకు జబ్బు స్పందిస్తున్న తీరును గుర్తించటానికి ఉపయోగపడగలదని భావిస్తున్నారు.
ఇదీ చూడండి: చైన్‌స్నాచింగ్‌లో సెంచరీ కొట్టేసిన చోరుడు.. చిన్న పొరపాటుతో దొరికిపోయాడు..!
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!