రాష్ట్రంలోని అమ్రాబాద్ నల్లమల అడవుల్లో యురేనియం నిల్వలు ఉన్నాయని హైదరాబాద్‌లోని ఏఎండీ డైరెక్టర్ డి.కె.సిన్హా పేర్కొన్నారు. ప్రస్తుతానికి అక్కడ అన్వేషణ నిలిపివేసినా.. భవిష్యత్తులో చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వద్దని అసెంబ్లీలో తీర్మానం చేయడం, స్థానిక ప్రజలు వ్యతిరేకించడంతో యురేనియం అన్వేషణ రాష్ట్రంలో నిలిపివేశామన్న ఆయన.. ప్రజల అభిప్రాయాలను తాము గౌరవిస్తామన్నారు.
దేశ అవసరాల దృష్ట్యా అందరినీ ఒప్పించిన తర్వాతే భవిష్యత్తులో యురేనియం అన్వేషణ ఉంటుందని సిన్హా స్పష్టం చేశారు. యురేనియం అన్వేషణ, తవ్వకాలతో భయాందోళనలు అక్కర్లేదని చెప్పారు. వంద చోట్ల సర్వే చేస్తే.. ఒకచోట మాత్రమే మైనింగ్‌కు అవకాశం ఉంటుందని తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(ఇండియా) ఆధ్వర్యంలో బేగంపేటలోని ఏఎండీ ఆడిటోరియంలో గురువారం జరిగిన జర్నలిస్టుల కార్యశాలలో 'అణు విద్యుత్తు: బొగ్గుపులుసు వాయువు ఉద్గారాలను సున్నాకు తగ్గింపునకు అడుగులు' అంశంపై ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం అణు విద్యుత్ వాటా 3 నుంచి 2 శాతానికి తగ్గిందని.. 2070 నాటికి కాలుష్య వ్యర్థాలను సున్నా శాతానికి తగ్గించే లక్ష్యం చేరుకోవాలంటే వంద శాతం అణు విద్యుత్తును పెంచాల్సి ఉంటుందని డి.కె.సిన్హా పేర్కొన్నారు. ప్రస్తుత అణు విద్యుత్తు అవసరాలకు తగ్గ యురేనియం నిల్వలు మన దగ్గర ఉన్నాయని.. భవిష్యత్తు కోసమే అన్వేషణ అని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చూడండి..
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదు: హైకోర్టు
ద్రౌపదీ ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ.. ఇంటికి వెళ్లి అభినందిచిన ప్రధాని మోదీ