Break to Amaravati padayatra: ఏపీలో పోలీసుల తీరుకు నిరసనగా అమరావతి రాజధాని రైతులు పాదయాత్రను నిలుపుదల చేశారు. పోలీసుల తీరుపై న్యాయస్థానంలోనే తేల్చుకుని తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తామని రైతులు ప్రకటించారు. ఐకాస నేతల సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రకు దాదాపు 4 రోజులు తాత్కాలిక విరామం మాత్రమే అని ఐకాస ప్రకటించింది. న్యాయస్థానానికి సెలవులు ఉన్నందున అంతవరకు పాదయాత్ర నిలుపుదలకు నిర్ణయించామని తెలిపారు. కోర్టు నుంచి మార్గదర్శకాలు తీసుకుని అరసవల్లి వరకు పాదయాత్ర కొనసాగించాలని ఐకాస నిర్ణయించింది.
రైతుల పాదయాత్రకు ఉదయం నుంచి పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. రైతులు రామచంద్రాపురంలో బస చేస్తున్న విజయ ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దేవుని రథం నిలిపి ఉన్న రామచంద్రపురం పట్టణంలోకి వెళ్లి రైతులు పాదయాత్ర ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బస చేసిన కల్యాణ మండపం నుంచి రైతులను బయటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. రైతులను కలిసేందుకు బయట వారెవ్వరినీ అనుమతించడం లేదు. సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్నవారినీ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో రైతులు బస చేస్తున్న కల్యాణ మండపం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ మాధవరెడ్డి నేతృత్వంలోని పోలీసుల బృందం రైతులు బస చేస్తున్న కల్యాణ మండపాన్ని చుట్టిముట్టింది. ఈ క్రమంలో పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు.
ఈ సందర్భంగా మహిళలను పోలీసులు తీవ్రంగా గాయపరిచారని అమరావతి ఐకాస నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రత పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నామని తెలిపారు. పాదయాత్రకు తాత్కాలిక విరామం మాత్రమే ప్రకటించామన్న నేతలు.. తదుపరి కార్యాచరణ చర్చించి ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అడ్డంకులన్నీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించి తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. రైతులను మట్టుబెట్టే విధంగా పోలీసు, ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగానే తాత్కాలిక విరామమని ఐకాస నేతలు స్పష్టం చేశారు.
పోలీసులు మహిళలను తీవ్రంగా గాయపరిచారు. మహిళల భద్రత పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాం. పాదయాత్రకు తాత్కాలిక విరామమే ప్రకటించాం. తదుపరి కార్యాచరణపై చర్చించి ప్రకటిస్తాం. అడ్డంకులన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. కోర్టును ఆశ్రయించి తదుపరి నిర్ణయం ప్రకటిస్తాం. రైతులను మట్టుపెట్టేలా పోలీసు, ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. మహిళలపై దాడులకు నిరసనగానే తాత్కాలిక విరామం. -అమరావతి ఐకాస నేతలు
ఇవీ చదవండి:
పసలపూడిలో పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత..