ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాల్సిన ఆవశ్యకతను తెలియజేసేందుకు దిల్లీ వెళ్లిన మహిళా ఐకాస... పలువురు జాతీయ నేతలను కలిసింది. సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి. రాజా, సీతారాం ఏచూరిని కలిసి...రాజధాని అంశాన్ని వివరించింది. మద్దతు తెలిపిన జాతీయ నాయకులు అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించి....పార్లమెంటులో ఆ అంశాన్ని లేవనెత్తుతామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్, డీఎంకే ఎంపీ కనిమొళిని కలిసి తమ ఆందోళనలకు మద్దతివ్వాలని కోరారు. ఏఐసీసీ కార్యదర్శి మాణిక్కం ఠాగూర్‌ను కలిసిన మహిళా నేతలు... రాజధాని అంశం, రైతుల త్యాగాలను వివరించారు. వారికి మద్దతు తెలిపిన మాణిక్కం...రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె ఎంపీ సుప్రియా సూలేతో పాటు మరికొంత మంది నాయకులను ఐకాస నేతలు కలవబోతున్నారు.
నాలుగైదు రోజులు దిల్లీలోనే ఉండైనా సరే అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులను కలిసి అమరావతి ఆక్రందనను వివరించి మద్దతు కూడగడతామని...ఐకాస నేతలు చెబుతున్నారు. కచ్చితంగా అమరావతిని సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్‌మెంట్‌లు కోరామని...అనుమతిస్తే కలిసి తమ గోడును విన్నవించుకుంటామని ఐకాస నేతలు అంటున్నారు.
ఇదీ చూడండి: యాదాద్రి ఆలయంలో ఆకట్టుకుంటున్న నిర్మాణ పనులు