ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉద్యమం ఈ నెల 17 నాటికి ఏడాది పూర్తిచేసుకుంటున్న వేళ.... ఐకాస ప్రకటించిన కార్యాచరణలో భాగంగా... నేడు విజయవాడలో మహాపాదయాత్ర చేపట్టనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ భారీ ర్యాలీ... పడవల రేవు కూడలి నుంచి బీటీఆర్ఎస్ రోడ్డు వరకు సాగనుంది. అధికార వైకాపా మినహా అన్ని రాజకీయపక్షాలూ ర్యాలీలో పాల్గొననున్నట్లు ఐకాస నాయకులు తెలిపారు. మహాపాదయాత్రలో తెలుగుదేశం పాల్గొంటుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు వెల్లడించారు.
అమరావతి ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారన్న ఆయన.... ఏపీ సీఎం జగన్ రైతులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. విజయవాడలో అమరావతి ఐకాస చేపట్టిన ర్యాలీకి మద్దతు ఇస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు.
ఈ నెల 17న బహిరంగ సభ నిర్వహించే స్థలం విషయంలో మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాని రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఉద్ధండరాయునిపాలెంలో సభ నిర్వహించాలని ఐకాస పట్టుబడతుండగా.... సోమవారం వరకు పోలీసుల నుంచి అనుమతి రాలేదు. పోలీసులు అక్కడ అనుమతించకపోతే.. మరోచోట నిర్వహించేందుకు ఐకాస నేతలు సమాలోచన చేస్తున్నారు. రాయపూడి పెట్రోల్ బంకు వెనుక ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రాంతాన్ని ఐకాస నేతలు పరిశీలించారు.
- ఇదీ చూడండి : కరోనా వేళ దేశంలో పెరిగిన గృహహింస