తెలుగు సినీ పరిశ్రమ అనేక కష్టాల్లో ఉందని, సాధ్యమైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు విడుదలయ్యే సినిమాలన్నీ ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉన్నాయన్న అల్లు అరవింద్... రాజు తలచుకుంటే వరాలకు కొదవా.. అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ప్రచార చిత్రం విడుదల వేడుక సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రత్యేక విజ్ఞప్తి చేసిన అల్లు అరవింద్... సినీ పరిశ్రమ మాటగా తన విజ్ఞప్తిని పరిశీలించాలని కోరారు. కరోనా నుంచి ప్రజలను రక్షించినట్టుగానే సినీ పరిశ్రమను కాపాడాలని కోరారు. పరిశ్రమ విజయవంతంగా కొనసాగాలంటే ముఖ్యమంత్రి జగన్ సహకారం అవసరమన్నారు. గత నాలుగు రోజులుగా సినీ పరిశ్రమపై ఏపీలో తీవ్ర చర్చ జరుగుతున్న వేళ... పలువురు నిర్మాతలు ఏపీ మంత్రి పేర్నినానితో సంప్రదింపులు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
‘‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌కు ఇది మొదటి ఫంక్షన్. దీని తర్వాత ప్రీరిలీజ్ వేడుక, విడుదలైన తర్వాత సక్సెస్‌మీట్ తప్పకుండా ఉంటుంది. గీతాఆర్ట్స్‌లో విజయవంతమైన చిత్రాలు మేము ఇవ్వలేదు.. ప్రేక్షకులు మాకు ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన ధైర్యాన్ని చూసి, బాలీవుడ్ సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ వేదికగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిగారిని కోరేది ఏంటంటే.. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేక ఇబ్బందుల్లో ఉంది. రాజు తలుచుకుంటే, వరాలకు కొదవా? దయచేసి మీరు తలుచుకుని, పరిశ్రమలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపమని ఈ వేదికగా కోరుతున్నా. మీరు చిత్ర పరిశ్రమను ఎంత ప్రోత్సహిస్తారో.. అన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతాయి. నేను చేసే విన్నపాన్ని ఇండస్ట్రీ విన్నపంగా తీసుకోండి. ఒక మెస్సేజ్‌ను ఎంటర్‌టైనింగ్ రూపంలో ఈ సినిమా ద్వారా చెప్పారు. సినిమా విషయంలో ఎక్కడా రాజీపడకుండా చేశారు’’
-అల్లు అరవింద్, సినీ నిర్మాత
ఇదీ చదవండి: ఏపీ మంత్రి కన్నబాబు, అంబటి రాంబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్‌కు కోర్టు ఆదేశం