కరోనాతో ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వ తీరుకు నిరసనగా నేడు ప్రగతి భవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వామపక్షాలు, ఇతర పార్టీలు ప్రకటించాయి. "ముఖ్యమంత్రి మేలుకో .. ప్రజల ప్రాణాలు కాపాడు.. బతుకులు నిలబెట్టు " అనే నినాదంతో ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపాయి. దీంతో పాటు నగరంలో పలు కూడళ్ల వద్ద నల్లజెండా ఎగురవేసి నిరసనలు నిర్వహిస్తామని ప్రకటించారు.
గురువారం మగ్ధూంభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, తెదేపా తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ పాల్గొన్నారు. తాము ఎన్నిసారు ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతోనే నిరసన తెలపాలని నిర్ణయించినట్లు తెలిపారు. కరోనా చికిత్స కోసం వెయ్యి కోట్ల రూపాయలైనా ఖర్చు చేస్తానన్న సీఎం ఇప్పుడు ఏమి పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటే నమ్మకం లేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇవీ చూడండి: కరోనా బాధితుల్లో ధైర్యం నింపేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి: ఈటల