panchayat national awards : జాతీయ పంచాయతీ అవార్డులకు ప్రతిపాదనలు పంపించని గ్రామాలకు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపై ప్రభావం పడుతుందని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. గ్రామ పంచాయతీలన్నీ అవార్డులకు ఎంట్రీలు నమోదు చేయాలని స్పష్టం చేసింది. కొన్ని పంచాయతీలు ఎంట్రీలు పంపించలేదని గుర్తించిన కేంద్రం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. జాతీయస్థాయిలో పంచాయతీ అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం గ్రామాల నుంచి వివిధ సూచీల మేరకు ఎంట్రీలను ఆహ్వానిస్తోంది.
రాష్ట్రంలోనూ అన్ని గ్రామాల కార్యదర్శులకు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం ఎంట్రీలను నమోదు చేసింది. కాగా ఇప్పటికే నమోదైన ఎంట్రీలను పరిశీలించిన మండలస్థాయి కమిటీలు వాటికి మార్కులు ఇచ్చాయి. వీటిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో పరిశీలిస్తున్న కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ప్రతిపాదనల్లో పొరపాట్లను గుర్తించింది.
ఎంపిక చేసిన మండలాల్లోని కొన్ని గ్రామాలను పరిశీలించినపుడు.. కమిటీలు గతంలో క్షేత్రస్థాయి పరిశీలనలో ఇచ్చిన స్కోరులో.. ఎలాంటి ఆధారాలు, రిమార్కులు లేకుండానే మార్పులు చేసినట్లు గుర్తించింది. దీంతో కమిటీలు ఇలా మార్పులు చేయడానికి వీల్లేదని, స్కోరును మార్చాల్సి వస్తే.. వాటికి సంబంధించిన ఆధారాలను ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ అప్‌లోడ్ చేయకుంటే ముందు స్కోరునే పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. కాగా మండల స్థాయిలో ఎంపికలను వెంటనే పూర్తిచేసి, అవార్డులకు ఎంట్రీలను ఈనెల 19లోగా అందజేయాలని తెలిపింది.
ఇవీ చదవండి: