కరోనాతో ప్రజలు సతమతమవుతున్న విపత్కర పరిస్థితుల్లో పెట్రోల్ ధరలు పెరగడంపై కాంగ్రెస్ మండిపడింది. ఉపాధి కరువై, జీతాల్లో కోతతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆపద సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల పెంచడం ఏమిటని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరసుగా 14వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
లీటరు పెట్రోల్‌పై రూ.32.98 ఎక్సైజ్ సుంకం, డీజిల్ పై రూ. 31.82 వేసి సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్న ఆయన ఈ ఖరీఫ్ సీజన్లో రైతులపై అదనంగా ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.