AICC Incharge Manikrao Thakre Comments: రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి పార్టీ నేతలందరూ ఐక్యంగా పని చేయాలని కొత్త రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్‌రావ్ ఠాక్రే సూచించారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకోవడంతో పాటు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో పీఈసీ, జిల్లా అధ్యక్షుల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా మానిక్‌రావు ఠాక్రే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను విజయవంతం చేయాలని నేతలకు మానిక్‌రావ్ ఠాక్రే పిలుపునిచ్చారు. ఈ నెల 20వ తేదీన మళ్లీ వచ్చి... మూడు రోజులు ఉంటానని పేర్కొన్నారు. ఈ నెల 20, 21, 22 తేదీలలో ఇక్కడే ఉండి పార్టీ కార్యక్రమాలపై చర్చిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర నేతలందరితో మరోసారి మాట్లాడుతానని మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు.
'ఈ రెండు రోజులు నేను రాష్ట్ర నేతలను కలిశాను. మొదటి సారి తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చాను. ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేశాను. రెండు రోజులు జరిగిన సమావేశాల్లో పాల్గొన్న నేతలు సూచనలు చేశారు. వాటిని నేను విన్నాను. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కలిసి పని చేసి విజయం సాధిస్తాం.'-మానిక్‌రావ్ ఠాక్రే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్
సమస్యలను పరిష్కరించడంలో ఠాక్రేకు మంచి గుర్తింపు : టీ కాంగ్రెస్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్‌రావ్ ఠాక్రే సమావేశం నిర్వహించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ముంబై బాంబు బ్లాస్ట్, మతకల్లోలాలు జరిగిన సమయంలో ఆయన హోంమంత్రిగా పనిచేశారని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో హోంమంత్రిగా ఠాక్రే ఎంతో సమర్థవంతంగా పని చేశారన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు హోంమంత్రి జానారెడ్డిలా... శరత్ పవార్ హయాంలో ఠాక్రే అంతే సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. సమస్యలను పరిష్కరించడంలో తనదైన శైలి ప్రదర్శిస్తారని ఆయనకు మంచి గుర్తింపు ఉందని తెలిపారు. హాత్ సే హాత్ జోడో యాత్ర నేపథ్యంలో పార్టీలో అందరితో మాట్లాడారన్న రేవంత్... 21న మరోసారి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పర్యటించి హాత్ సే హాత్ జోడో యాత్ర కమిటీలను ప్రకటిస్తారని వెల్లడించారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మాణిక్‌రావు ఠాక్రే నియమితులైన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఏఐసీసీ ఇంఛార్జ్ కార్యదర్శులతో బుధవారం సమావేశమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టిలతో పాటు 24 మంది నేతలతో వేర్వేరుగా సమావేశమై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, బలోపేతంపై చర్చించారు. రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన మానిక్‌రావ్ ఠాక్రే... నిన్న నేతలతో వరుస భేటీలతో తీరికలేకుండా గడిపారు. తొలుత రాష్ట్ర ఇంఛార్జ్ ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావిద్, రోహిత్ చౌదరీలతో గంటపాటు సమావేశమైన ఆయన... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు, నాయకుల తీరు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో విడివిడిగా సమావేశమయ్యారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న వివాదాలను పక్కన పెట్టి అందరూ ఏకతాటిపై నిలచి పార్టీ కోసం పని చేయాలని తనతో సమావేశమైన నాయకులకు మానిక్‌రావ్ ఠాక్రే స్పష్టం చేస్తున్నారు. పార్టీ నాయకులు మధ్య తలెత్తిన విభేదాలు ఏంటీ ? వాటి పరిష్కరానికి తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాష్ట్ర నాయకత్వం అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటని ఆరా తీసినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకోవడంతోపాటు పార్టీని బలోపేతానికి ఏయే కార్యక్రమాలు నిర్వహించాలని సలహాలు తీసుకున్నారు.
ఇవీ చదవండి: