Agri Infrastructure Fund: దేశంలో వ్యవసాయాభివృద్ధి, ఉత్పత్తి గతిశీలతను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి మౌలిక సదుపాయాల పాత్ర కీలకం. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం.. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.లక్షకోట్ల అగ్రి ఇన్‌ఫ్రాస్టక్చర్ ఫండ్ ప్రకటించింది. దీని కింద గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.2 కోట్ల వరకు రుణం ఇస్తోంది. కానీ, సరైన అవగాహన లేక ఆశించిన స్థాయిలో ఔత్సాహికులు ముందుకు రావడం లేదు. దీంతో రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ.. కేంద్ర వ్యవసాయ శాఖ, నాబార్డు, బ్యాంకర్లను ఒకే వేదికపై తీసుకొచ్చి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.
2020-21 నుంచి ఆరేళ్లలో ఈ పంపిణీ పూర్తవ్వాల్సి ఉంది. నాబార్డ్ పాలసీ ప్రకారం అన్ని అర్హత కలిగిన రుణ సంస్థలకు నీడ్ ఆధారిత రీఫైనాన్స్ మద్ధతును అందుబాటులో ఉంచింది కేంద్రం. తిరిగి చెల్లింపు కోసం మారటోరియం కనిష్టంగా 6 నెలలు, గరిష్టంగా 2 ఏళ్లకు లోబడి మారవచ్చు. గరిష్టంగా 7 ఏళ్ల వరకు 3శాతం వడ్డీ రాయితీ అందుబాటులో ఉంటుంది.
దేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాంతాల వారీగా జరిగిన కేటాయింపుల్లో తెలంగాణకు రూ.3,075 కోట్లు దక్కగా.. వినియోగంలోమాత్రం వెనకబడిపోయింది. కేవలం రూ.500కోట్లు మాత్రమే వాడుకుంది. మిగతా మొత్తం వినియోగానికి అవకాశం ఉన్న దృష్ట్యా.. ఔత్సాహిక యువత, ఎఫ్పీఓల ప్రతినిధులు ముందుకు వస్తే సహకరిస్తామని మేనేజ్ సంస్థ డైరెక్టర్ జనరల్ చంద్రశేఖర వెల్లడించారు. ప్రధాన వాణిజ్య బ్యాంకులతో పాటు రాష్ట్ర సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార సంఘాలు.. ఇలా మొత్తం 461 బ్యాంకులు రుణాలు ఇస్తున్న దృష్ట్యా.. యువతకు ఇదొక వరం అని చెప్పవచ్చు.
"చాలా మంది యువతీయువకులు పరిశ్రమ స్థాపనలకు అంగీకరించారు. రెండు,మూడు నెలల్లో బ్యాంకులకు కావల్సిన పత్రాలను ఇస్తే వారు అందుకు సంబంధించిన రుణాలు మంజూరు చేస్తారు." -కె.రాములు తెలంగాణ ఆగ్రోస్ ఎండీ
"పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి పెట్టే ఆలోచనలో ఉన్నాం. మా ప్రాంతంలో 371మంది రైతులతో సంఘంగా ఉన్నాం. ఈసమావేశం మాకు చాలా ఉపయోగంగా పడింది." - వీరబాబు, కామధేను రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు
ఇవీ చదవండి: TS Schools: వర్షాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష. మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులు