Actor Navdeep ED Inquiry Today : మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సినీ నటుడు నవదీప్ ఈడీ విచారణ ముగిసింది. ఈ కేసులో దాదాపు 8 గంటలకు పైగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. మత్తు పదార్థాలకు సంబంధించి మనీలాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. మాదకద్రవ్యాల విక్రేతలతో నవదీప్‌ను ఉన్న ఆర్థిక సంబంధాలు, బ్యాంకు ఖాతాల్లో ఆర్థక లావాదేవీలు గురించి అధికారులు ఆయనను ఉదయం 11 గంటల నుంచి విచారించారు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన దస్త్రాలను నవదీప్ ఈడీ అధికారులకు చూపించినట్లు సమాచారం. మరోవైపు నార్కోటిక్ పోలీసులు నవదీప్‌కు ఇంకోసారి విచారించేందుకు నోటీసులు ఇవ్వడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. బ్యాంకు ఖాతా లావాదేవీలు, డ్రగ్స్ విక్రేతలతో ఉన్న ఆర్థిక సంబంధాలపై ఈడీ అధికారులు లోతుగా ఆరా తీశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అవసరమైతే మరోసారి పిలిపిస్తామని ఈడీ అధికారులు నవదీప్‌కు చెప్పారు. రాత్రి 7గంటల సమయంలో నవదీప్ ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయాడు.
మాదాపూర్ మాదక ద్రవ్యాల కేసు(Madhapur Drugs Case)కు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. విచారణ సందర్భంగా నిందితులు చెబుతున్న విషయాలు.. ఆయా వ్యక్తుల ఫోన్ డేటా సాయంతో మరికొంత మందిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు నిందితుల కాల్ లిస్ట్‌లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల పేర్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఇందులో భాగంగానే నార్కోటిక్ పోలీసులు ఇదివరకే నటుడు నవదీప్‌ను విచారించగా.. తాజాగా ఈ వ్యవహారంలోకి ఈడీ రంగప్రవేశం చేసింది. ఈ మేరకు నేడు విచారణకు హాజరు కావాలంటూ నవదీప్‌కు ఈ నెల 7న నోటీసులు జారీ చేసింది. ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
Madhapur Drugs Case Update : మాదాపూర్ డ్రగ్స్ కేసు.. దర్యాప్తుతో 'మత్తు' వినియోగదార్లలో దడ
Madhapur Drugs Case Update : ఈ కేసులో నార్కోటిక్స్ పోలీసులు (Narcotics Police) నవదీప్‌ను ఇటీవల విచారించిన విషయం తెలిసిందే. ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ లిస్ట్ ముందుంచి సుమారు 6 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. నవదీప్ నుంచి పలు కీలక సమాచారం రాబట్టారు. వాట్సాప్ చాటింగ్‌ను రిట్రీవ్ చేసి.. డేటా అందిన తర్వాత మరోసారి నవదీప్‌ను విచారించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Tollywood Drugs Case Update : నార్కోటిక్ పోలీసుల విచారణ ముగించుకుని బయటకు వచ్చిన అనంతరం నవదీప్ మాట్లాడారు. తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని పేర్కొన్నారు. ఏపీలోని వైజాగ్‌కు చెందిన రాంచందర్‌తో తనకు పరిచయం మాత్రమే ఉందని.. అతనితో ఎలాంటి డ్రగ్స్ డీలింగ్ చేయలేదని తెలిపారు. తనకు నోటీసులు ఇచ్చినందున పోలీసుల ఎదుట విచారణకు హాజరైనట్లు తెలిపారు. గతంలో తాను ఓ పబ్‌ను నిర్వహించానని.. ఆ విషయంలో పలు వివరాలు తీసుకున్నారని స్పష్టం చేశారు. అధికారులు అడిగిన అన్ని వివరాలు ఇచ్చానని.. అవసరం అనుకుంటే మళ్లీ పిలుస్తామన్నారని చెప్పారు.
ఈ ఏడాది సెప్టెంబరు 14న గుడి మల్కాపుర్ పోలీసులతో కలిసి నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. ఆ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వారి విచారణలో భాగంగా నవదీప్‌తో సంప్రదింపులు జరిపినట్లు తేలడంతో అతడినీ నిందితుడిగా చేర్చారు.
ED Notices to Hero Navdeep : 10న విచారణకు రండి.. సినీనటుడు నవదీప్‌కు ఈడీ నోటీసులు