భారత దేశంలో 125.65 కోట్లు మంది భారత విశిష్ఠ గుర్తింపు కార్డులు-ఆధార్ కలిగి ఉన్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ-యుఐడీఎఐ తాజా లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఆదాయపు పన్ను శాఖ లెక్కల ప్రకారం దేశంలో 48 కోట్ల మందికిపైగా శాశ్వత ఖాతా సంఖ్య-పాన్ కార్డుదారులు ఉన్నారు. ఇందులో దాదాపు 44 కోట్ల పాన్ కార్డులు వ్యక్తిగతమైనవి కాగా మిగిలినవి ఇతర విభాగాలకు చెందిన పాన్ కార్డులుగా ఐటీశాఖ పేర్కొంటోంది.
మార్చి 31 చివరి తేదీ...
ఈ జనవరి చివరినాటికి 30.75 కోట్ల మంది ఆధార్‌కార్డులతో అనుసంధానం చేసుకోగా మరో 17.58 కోట్ల మంది చేసుకోలేదని ఐటీ అధికారుల తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన నెలన్నరలో మరో నాలుగు కోట్ల మంది అనుసంధానం చేసుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి ఇంకో మూడు నుంచి నాలుగు కోట్లు మంది అనుసంధానం చేసుకుంటారని భావించినా ఇంకో పది కోట్లు మంది పాన్‌కార్డుదారులు మిగిలిపోతారని అంచనా వేస్తున్నారు. నెలాఖరు నాటికి అనసంధానం పూర్తికాని కార్డుదారులకు చెందిన పాన్‌లు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పని చేయవని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 139(ఎ) ప్రకారం వాటిని రద్దు చేసే అధికారం తమకుందని అధికారులు చెబుతున్నారు.
పదివేలు జరిమానా...
ఎవరైనా నిర్దేశించిన గడువు తరువాత అనుసంధానం చేసుకునేందుకు ముందుకొస్తే వారికి పదివేలకు తక్కువ లేకుండా జరిమానా వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగస్థులుగా ఉండి అనుసంధానం చేయనట్లయితే మరింత కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:మే 31 వరకు బీఎస్-4 వాహనాల విక్రయం?