తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు పద్మావతి.. తనకి తాను పెట్టుకున్న పేరు 'నిజం'. అతను చేసే పని రిక్షా తొక్కడం.. సొంత ఇళ్లు లేదు.. ఆస్తి పాస్తులు లేవు.. రిక్షానే అతనికి జీవనాధారం. అయినా దాతృత్వంలో మాత్రం అపర కుబేరుడే.. తన తండ్రి అంత్యక్రియలప్పుడు ఎదురైన సంఘటనతో పరులసేవ చేయాలని నిర్ణయించుకున్న అతని సేవా ప్రయాణం 20 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది.
కేరళకు చెందిన పుదుచ్చేరి పద్మావతి (నిజం).. తలిదండ్రులు సులోచన, శ్రీధర్ నంబూద్రితో కలిసి 35 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కొల్లిపరకు వలస వచ్చారు. సులోచన, శ్రీధర్‌కు ఆరుగురు మగసంతానం కావటంతో.. ఇతనికి పద్మావతి అని పేరు పెట్టుకున్నారు. 20 ఏళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో మరణించగా మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్లేందుకు ఎవరు తోడు రాలేదు.
ఈ ఘటన పద్మావతిని తీవ్రంగా కలచివేసింది. ఇలాంటి ఇబ్బంది ఎవరికీ రాకూడదని భావించి రిక్షా కొనుగోలు చేసి అనాథ శవాలను శ్మశానానికి తీసుకెళ్లడం ప్రారంభించాడు. ఇప్పటికి సుమారు 600 శవాలను శ్మశానానికి ఉచితంగా తరలించారు. అప్పట్నంటి ఇతని సేవా ప్రయాణం రిక్షా సాక్షిగా కొనసాగుతూనే ఉంది.
హెల్మెట్ వాడకం, ట్రాఫిక్ రూల్స్, చెట్ల పెంపకం, స్వచ్ఛభారత్ వంటి కార్యకలాపాలపై అవగాహన కల్పిస్తూ 1998లో రిక్షా యాత్ర ప్రారంభించారు. రిక్షాపై ఆలోచింపజేసే వ్యాఖ్యలు, చిత్రాలు గీయించారు. మహనీయుల చిత్రాలతోపాటు మద్యపానం వల్ల కలిగే అనార్థాలు, చెట్ల పెంపకం హెల్మెట్ వాడకం వంటి వాటిని వివరించే ఫోటోలను అతికించారు.
2.50 లక్షల కిలోమీటర్ల రిక్షా యాత్ర
20 సంవత్సరాల క్రితం ప్రారంభమైన పద్మావతి రిక్షా యాత్ర ఇప్పటివరకు 2.50 లక్షల కిలోమీటర్లు సాగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గోవాల్లో పర్యటిస్తూ.. పలు అంశాలపై అవగాహన కల్పించారు. అతని యాత్ర సాగిన గ్రామాల్లో దారిలో ఎవరన్నా వృద్ధులు, దివ్యాంగులు , విద్యార్ధులు కనబడితే ఉచితంగా రిక్షాలో ఎక్కించుకుని వెళతారు.
మదర్ థెరిసా, అబ్దుల్ కలాం వంటి మహానీయుల జయంతి వేడుకలు, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తాడు. ఇవన్నీ రిక్షా తొక్కుతూ తనకొచ్చిన కొద్ది సంపాదనతో చేస్తారు. కూడబెట్టిన దానిలో సగం తన ఖర్చులకు, మిగిలిన సగం సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తారు. లాక్ డౌన్ నేపథ్యంలో రిక్షా కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 5వేల రూపాయలను సేవకే వినియోగించారు.
2019 సంవత్సరంలో కృష్ణా జిల్లా అవనిగడ్డకు వచ్చిన నిజంను ఈ ప్రాంత ప్రజలు బాగా ఆదరించారు. ఆ కృతజ్ఞతతో 36మంది పారిశుద్ధ్య కార్మికులకు భోజనం పెట్టారు. తన సొంత ఖర్చుతో బియ్యం, సరకులు అందజేశారు. 57 ఏళ్ల వయస్సులో 50 కిలోమీటర్ల దూరం వచ్చి కార్మికులకు బియ్యం పంపిణీ చేసిన పద్మావతిని అందరూ అభినందించారు. పోలీసులు అతనికి కొత్త చరవాణి కొని ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే 2 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. గుంటూరు జిల్లా కొల్లిపరలో తన బతుకుదెరువు కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంటి స్థలం ఇవ్వాలని నిజం కోరుతున్నారు.