Constable Organs Donated: అతనో కానిస్టేబుల్. ఆరు నెలల క్రితమే వివాహం చేసుకున్నాడు. పైగా అతని భార్య నాలుగు నెలల గర్భవతి కూడా. ఇంకేముంది అతని జీవితం అంతా సాఫీగా సాగుతున్న వేళ బైక్ ప్రమాదం వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. హైదరాబాద్ గోల్నాకలోని తులసీరామ్ నగర్‌కి చెందిన శ్రీకాంత్(28) బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు.
కుటుంబసభ్యుల ఔదార్యం.. ఐదుగురికి ప్రాణదానం
Organs Donated: తాను చనిపోతూ మరో ఐదుగురికి ప్రాణం పోశాడు కానిస్టేబుల్ శ్రీకాంత్. 28 ఏళ్ల శ్రీకాంత్ అంబర్‌పేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. ఈ నెల 16న ద్విచక్రవాహనంపై వెళ్తున్న శ్రీకాంత్‌ని మరో బైక్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. బాధితుడిని మలక్ పేట యశోదా ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించగా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం శ్రీకాంత్ బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చి.. జీవన్ దాన్ సంస్థకు సమాచారం అందించారు. శ్రీకాంత్ నుంచి లివర్, 2 కార్నియా, రెండు కిడ్నీలను సేకరించి అవసరమైన వారికి అందించిన జీవన్ దాన్ ప్రతినిధులు.. మరణంలోనూ శ్రీకాంత్ మరొకరికి కొత్త జీవితాన్ని అందించారని కొనియాడారు. అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులను వారు అభినందించారు.