హైదరాబాద్ నారాయణగూడ పైవంతెన వద్ద రూ. 8 కోట్ల నగదును మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ బ్యాంకు నుంచి భాజపా కార్యాలయ సిబ్బంది డబ్బు విత్డ్రా చేసి తరలిస్తుండగా పక్కా సమాచారంతో దాడి చేశారు. మొదట హిమాయత్ నగర్ వద్ద కారు తనిఖీల్లో రూ.2 కోట్లు పట్టుకున్నారు. ప్రదీప్, శంకర్ అనే వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు నారాయణగూడ బ్యాంకు వద్ద గోపీ అనే వ్యక్తి రూ.6 కోట్లు విత్ డ్రా చేస్తుండగా దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. వీరిలో గోపి, చలపతి అనే వ్యక్తులు భాజపా కార్యాలయంలో సహాయకులుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన సొమ్ము భాజపా అధికారిక ఖాతా నుంచి తీస్తున్నట్లు తెలిపారు. వారిని నారాయణ గూడ పోలీసులకు అప్పగించారు.
గోప్యత పాటిస్తున్న పోలీసులు
ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు చేపట్టి నగదు పట్టుకుంటున్నప్పటికీ ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడటం ఇదే తొలిసారి. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు. పోలీసులు పట్టుకున్న రూ. 8 కోట్లు, ఏడుగురు వ్యక్తులను నారాయణ గూడ పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించారు. వారు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి : ప్రచారానికి పచ్చనోట్లు.. రోజుకు రెండొందలు