గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియడం సహా.. ప్రజాభాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధే లక్ష్యంగా సర్కారు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుచేసింది. గత నెల 6న గ్రామసభల నిర్వహణతో కార్యాచరణ ప్రణాళిక ప్రారంభంకాగా.. ప్రతి గ్రామానికి ఒక మండలస్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి ప్రణాళిక అమలు చేసింది. మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు గ్రామసభల్లో పాల్గొన్నారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుతో గ్రామాల్లో కదలిక వచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కలెక్టర్ల భాగస్వామ్యం బాగుందని... ప్రణాళిక అమలుపై వారు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారని వివరించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిపై జరిమానాలు విధించారు.
మంచి స్పందన..
ప్రణాళికలో భాగంగా గ్రామాభివృద్ధికి విరాళాలు స్వీకరించగా.. అందుకు మంచి స్పందన వచ్చిందని.. అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 12,753 పంచాయతీలకుగానూ 12,748చోట్ల గ్రామసభలు జరిగాయి. 12,748 చోట్ల పాదయాత్రలో చేపట్టాల్సిన పని గుర్తించగా 12,748 పంచాయతీల్లో వార్షిక ప్రణాళికలు తయారుచేశారు. 10 వేలకు పైగా చోట్ల వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులకు అవసరమైన స్థలాలు గుర్తించారు. శిథిలాలు, పిచ్చిమొక్కల తొలగింపు, పాడుబడ్డ బావుల పూడ్చివేత, బహిరంగ ప్రదేశాలు శుభ్రం చేశారు. వారంపాటు పవర్ వీక్ నిర్వహించి విద్యుత్ సంబంధిత సమస్యలు పరిష్కరించారు. 12,658 చోట్ల హరితప్రణాళికలు తయారు చేశారు. నెలరోజుల్లో సుమారు 13 కోట్ల మొక్కలు నాటగా... మరో 90 లక్షలు నాటాల్సి ఉంది.
నేటితో ముగింపు..
ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ప్రణాళిక ఇవాళ్టితో ముగియనుంది. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై ఈ నెల 10 న ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారు. మంత్రులు, కలెక్టర్లు, డీపీఓ, డీఎల్పీఓలతో సమావేశం కానున్న సీఎం.. గ్రామాల్లో పారిశుద్ధ్యం కోసం తీసుకున్న చర్యలు, భవిష్యత్‌లో చేయాల్సిన పనులపై చర్చిస్తారు. ఈ భేటీలో తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తారు. 30 రోజుల ప్రణాళిక అమలు తర్వాత ప్రభుత్వం నియమించిన బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయని సీఎం గతంలో ప్రకటించారు. ఈ తరుణంలో బృందాల ఏర్పాటు, తనిఖీల విషయంపై.... నిర్ణయం తీసుకోనున్నారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తాయి. లక్ష్యాన్ని చేరుకున్న గ్రామాలకు ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇచ్చి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులు, అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోనుంది.
ఇవీ చూడండి: 'ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి