హైదరాబాద్ పరిధిలో బాహ్యవలయ రహదారి బయట మాత్రమే కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నగరంలో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ విధాన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ.1,200 కోట్ల పెట్టుబడులతో వివిధ కేటగిరీల కింద రాజధాని పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు అందిన 281 దరఖాస్తులను తిరస్కరించింది.
సానుకూల అంశాలపై అవగాహన...
ఆయా పరిశ్రమలను అవుటర్ వెలుపల స్థాపించాలని సర్కారు సూచించింది. అలానే ఓఆర్ఆర్ బయట పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న సానుకూల అంశాలపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించింది.
కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకే...
రాజధానిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా కాలుష్య కారక పరిశ్రమలను తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ పరిధిలో, సమీప ప్రాంతాల్లో ఉన్న 1746 పరిశ్రమలను కాలుష్య కారకాలుగా గుర్తించిన ప్రభుత్వం వాటిని ఓఆర్ఆర్ వెలుపల గుర్తించిన 19 ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమవుతోంది. వీటితో పాటు మరో 600 పరిశ్రమలను ఔషదనగరి పరిధిలోకి తరలించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఇవీ చూడండి: నేనూ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టూడెంట్‌నే: గవర్నర్ తమిళిసై