కరోనా బారినపడి ఎంతో మంది ఆస్పత్రులపాలయ్యారు. బాధితులకు సేవ చేయాల్సిన అనేక ఆస్పత్రులు... ఇదే అదనుగా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయి. అలాంటి ఆస్పత్రులపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ తీసుకొచ్చింది. ఇటీవలి కాలంలో వందల సంఖ్యలో ఆస్పత్రులపై ఫిర్యాదులు అందుకున్న సర్కారు.. చర్యలకు ఉపక్రమించింది.
22 ఆసుపత్రుల లైసెన్సులు రద్దు...
ప్రస్తుతం రాష్ట్రంలో 1,200కు పైగా ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్ సేవలు అందిస్తున్నాయి. అందులో 113 ఆస్పత్రులపై 174 ఫిర్యాదులు వచ్చినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆయా ఫిర్యాదులను పరిశీలించిన వైద్యారోగ్య శాఖ... 113 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అందులో ఇప్పటివరకు 22 ఆస్పత్రులకు సంబంధించిన కొవిడ్ లైసెన్సులు రద్దు చేసింది.
వాట్సాప్‌కు ఫిర్యాదులు...
అధిక ఫీజులు, సరైన చికిత్సలు అందించటం లేదని వాట్సాప్ నంబర్‌కు ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు 22 ఆస్పత్రులపై కొరడా ఝులిపించింది. బంజారాహిల్స్‌లో విరించి, కేపీహెచ్‌బీలోని మ్యాక్స్ హెల్త్, పద్మజ ఆస్పత్రులు... బేగంపేటలోని విన్, కాచిగూడలోని టీఎక్స్ (TX), సనత్‌నగర్‌లో నీలిమ, అమీర్‌పేట్‌లో ఇమేజ్, ఎల్బీనగర్ అంకుర్, మెడిసిస్... కొండాపూర్‌లో సియా లైఫ్ ఆస్పత్రుల కొవిడ్ సేవల లైసెన్సులను వైద్యారోగ్య శాఖ రద్దు చేసింది.
లైసెన్స్ రద్దు...
అల్వాల్‌లోని లైఫ్‌లైన్ మెడిక్యూర్, ఉప్పల్‌లో ఎక్స్(TX), సికింద్రాబాద్‌లో కిమ్స్ (KIMS), గచ్చిబౌలిలో సన్ షైన్, బంజారాహిల్స్‌లో సెంచురీ, లక్డీకాపూల్‌లో లోటస్, టోలీచౌకిలో ఇన్‌టెగ్రో ఆస్పత్రుల కొవిడ్ చికిత్స (Covid treatment) లైసెన్సులు రద్దు అయ్యాయి. ఇక వరంగల్‌లో లలిత, సంగారెడ్డిలో సాయిరామ్, మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో పంచవటి, షాపూర్‌నగర్‌లోని సాయి సిద్ధార్థ ఆస్పత్రుల్లో కొవిడ్ సేవల లైసెన్సులు రద్దయ్యాయి.
నిజామాబాద్‌లో 8...
నిజామాబాద్‌లోని 8 దవాఖానాలకు నోటీసులు ఇచ్చారు. కరోనా చికిత్సకు బిల్లులు ఎక్కువ వేశారంటూ... కివీ, వేదాన్ష్, ఇండస్, శశాంక్, రాజేష్, అన్షుల్, శ్రీగాయత్రి, అంకం ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చిన అధికారులు.. 24గంటల్లో సమాధానం ఇవ్వాలని సూచించారు.
డిశ్చార్జ్ తర్వాతే...
కొవిడ్ లైసెన్స్‌లు రద్దైన ఆస్పత్రులు... కొత్త రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకోడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే చికిత్స పొందుతున్నవారి బాధ్యత పూర్తిగా దవాఖానాలదేనని పేర్కొంది. ఆయా రోగులు కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేయాలని స్పష్టం చేసింది.