ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఉరుకులు పరుగులుగా ఉండే నగర వాసులు ప్రయాణానికి రైళ్లు ఆశ్రయిస్తున్నారు. సమ్మె మొదలైనప్పటి నుంచి ఎంఎంటీఎస్‌తో పాటు మెట్రో రైళ్లలో రద్దీ భారీగా పెరిగింది. ఈనెల 21 నుంచి విద్యాలయాలు పున:ప్రారంభమైన నేపథ్యంలో రద్దీ మరింతగా పెరిగింది. ఆ ఒక్కరోజే 11.5 లక్షల మంది అన్రిజర్వ్డ్ ప్రయాణికులను రవాణా చేసింది.
ఎంఎంటీస్కు ప్రయాణికుల తాకిడి
సాధారణ రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లలో 1.60 వేల మంది.... ఇతర రైళ్లలో 7.60 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. కానీ ఈనెల 21న ఎంఎటీస్లో 2.30 లక్షల మంది...ఇతర రైళ్లలో 9.20 లక్షల మంది ప్రయాణించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఇంటర్సిటీ రైళ్లకు అదనపు బోగీలు
పరిస్థితిని ముందుగానే ఊహించిన దక్షిణ మధ్య రైల్వే... కాచిగూడ-నిజామాబాద్, కాచిగూడ-కర్నూల్ సిటీ స్టేషన్ల మధ్య 4 ప్రత్యేక జన్ సాధారణ్ రైళ్లను నడిపింది. రోజువారీ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు 14 అదనపు కోచ్‌లను జతచేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. రాబోయే రోజుల్లో కూడా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రైల్వేశాఖ జీఎం గజానన్ మాల్యా అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మె ప్రభావంతో కిటకిటలాడుతున్న మెట్రో...