తెలంగాణలో శుక్రవారం కొత్తగా 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివే అని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1132 మందికి కరోనా సోకినట్లు మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు శుక్రవారం 34 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 727కి చేరిందని... ప్రస్తుతం గాంధీలో 376 మంది చికిత్స పొందుతున్నారన్నారు.
శుక్రవారం డిశ్చార్జ్ అయిన వారిలో 21 మంది జీహెచ్ఎంసీకి చెందిన వారు కాగా ముగ్గురు సూర్యాపేటకు, ముగ్గురు గద్వాలకు చెందిన వారు ఉన్నారని ఈటల చెప్పారు. అదే విధంగా వికారాబాద్, అదిలాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున డిశ్చార్జ్ అయ్యారన్నారు. రాష్ట్రంలో మొత్తం 22 జిల్లాల్లో 14 రోజులుగా కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి : భోపాల్ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్ లీక్లెన్నో...