ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆందోళనలు ఇంకా చల్లారడం లేదు. సమగ్ర న్యాయ విచారణ జరిపించాలనే డిమాండ్‌తో వామపక్షాలు నాంపల్లిలోని ఇంటర్ కార్యాలయాన్ని ముట్టడించాయి. లోనికి చొచ్చుకుపోయేందుకు యత్నించగా... అడ్డుకున్న పోలీసులు బేగంబజార్ ఠాణాకు తరలించారు.
గవర్నర్‌కు ఏబీవీపీ ఫిర్యాదు
ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ నరసింహన్‌ను ఏబీవీపీ నేతలు కోరారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విద్యార్థి సంఘం నాయకులు వినతిపత్రం ఇచ్చారు. బాధిత విద్యార్థుల కుటుంబాలకు సర్కార్ బాసటగా నిలవాలని కోరారు.
ఉద్రిక్తంగా మారిన ఎన్ఎస్యూఐ ఆందోళన
ఇంటర్ విద్యను గాడినపెట్టాల్సిన బాధ్యత సర్కార్‌దేనంటూ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ఎన్ఎస్యూఐ నేతలు ఆందోళన చేశారు. వీరంతా సచివాలయం వైపు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ ఠాణాకు తరలించారు.
శ్వేతపత్రం విడుదలకు డిమాండ్
ఇంటర్ ఫలితాల్లో గందరగోళం, తదనంతర పరిస్థితులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఆచార్య నాగేశ్వర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేసిన మౌన ప్రదర్శనకు ఆయన సంఘీభావం పలికారు.
ఇంటర్ బోర్డులో ప్రక్షాళన అవసరం
మరోవైపు దేశం మొత్తం వేలెత్తి చూపే విధంగా ఇంటర్ బోర్డ్ వ్యవహరించిందని తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్ల అసోసియేషన్ ఆరోపించింది. నిబంధనల ప్రకారం రోజుకు 30 పేపర్లు వ్యాల్యూయేషన్ చేయాల్సి ఉండగా 50 నుంచి 60 పేపర్లు వ్యాల్యూయేషన్ చేయాలని తమపై ఒత్తిడి చేశారని ప్రైవేట్ లెక్చరర్లు ఆరోపించారు.