నూతన అసెంబ్లీ, సచివాలయం నిర్మించాల్సిన అవసరమేంటని అఖిలపక్ష నాయకులు ప్రశ్నించారు. అనవసర నిర్మాణాలతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. వివేక్ వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హయత్ ప్యాలెస్ హోటల్‌లో 'సచివాలయం కూల్చివేత - కొత్త అసెంబ్లీ నిర్మాణం' అంశంపై అఖిల పక్షాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
మూఢనమ్మకాలతో, వ్యక్తిగత లాభం, విలాసవంతమైన జీవితం కోసం కొత్త భవనాలు కడుతున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఏం చేసినా చెల్లుతుందనే అతి విశ్వాసంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అన్ని పక్షాలను కలుపుకొనిపోతమని ముఖ్యమంత్రి అంటే... అన్ని పార్టీలను విలీనం చేసుకుంటారని అనుకోలేదని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ ఎద్దేవా చేశారు. కేసీఆర్కు భవనాలపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల పరిష్కారించడంలో లేదని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం.. తుగ్లక్ లాగా వ్యవహరిస్తున్నారని కార్యక్రమ నిర్వాహకుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు.
సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలను కూల్చవద్దని, సచివాలయం, శాసనసభ ఇప్పుడున్న భవనాల్లోనే కొనసాగించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. వారసత్వ కట్టడాల విధ్వంసాన్ని అడ్డుకొని, హైదరాబాద్ ఉనికి కాపాడుకోవాలని అభిప్రాయపడ్డారు. గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని అఖిలపక్షం నిర్ణయించింది. అత్యున్నత న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ఇది ప్రజాధన దుర్వినియోగమే: అఖిలపక్షం