YS Sharmila at Bhadrachalam: గోదావరి వరదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యమే కారణమని వైఎస్ షర్మిల ఆరోపించారు. బాధితులకు ప్రభుత్వం రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం రాయగడం గ్రామంలో గోదావరి వరద ముంపు బాధితులను వైఎస్ షర్మిల పరామర్శించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వరద బాధితుల సమస్యలను తెలుసుకున్నారు.
సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం ... మర్చిపోవడం మాత్రమే తెలుసని షర్మిల విమర్శించారు. గతంలో వరంగల్, ఖమ్మం రైతులని ఇలానే మోసం చేశారని విమర్శించారు. వరద బాధితులకు తక్షణ సహాయం చేయలేని సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. వరద బాధితులకు ఇస్తామని చెప్పిన రూ.10 వేల పరిహారం ఇంతవరకు అందలేదన్నారు.
ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి కరకట్ట ఎందుకు నిర్మించలేదు? వెయ్యి కోట్లు పెట్టి గుట్టమీద కాలనీ కట్టిస్తారా? కరకట్ట కట్టకుండా ఏం చేస్తున్నారు? ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా నేరవేర్చారా? ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని సీఎంను ఎవరు నమ్ముతారు? హామీలు నిలబెట్టుకోకపోతే కేసీఆర్ రాజీనామా చేయాలి. - వైఎస్ షర్మిల, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు
సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన: గోదావరి నదికి వరదలు వస్తాయని తెలిసి కూడా కరకట్ట ఎందుకు నిర్మించలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. భద్రాచలంలో వరద బాధితులను ఇళ్లను పరిశీలించిన ఆమె.. ముంపు బాధితులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం చెప్పినదాని కంటే ఇంకా చాలా ఎక్కువ వరద రావడంతో భద్రాచలం మునిగిపోయిందన్నారు. వరద వచ్చి 10 రోజులైనా ఇప్పటికీ పైసా సాయం చేయలేదని సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు.
ఎనిమిదేళ్లలో కరకట్టను ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. బాధితులను గాలికొదిలేసిన సీఎం కేసీఆర్.. వరదలకు కారణం క్లౌడ్ బరస్ట్ అని కట్టు కథలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడే కరకట్ట పనులు మొదలయ్యాయని.. కేసీఆర్ వచ్చాక కరకట్ట ఎందుకు పొడిగించలేదని నిలదీశారు. వరద బాధితులకు వెంటనే రూ.25 వేలు, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ వెంకటేశ్వరరావు వచ్చి మీ డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.
ఇవీ చదవండి:
ప్రజలకు అందుబాటులో ఉండండి.. అదే నాకు ఇచ్చే బహుమతి: కేటీఆర్
రాష్ట్రపతి కోవింద్‌కు మోదీ విందు.. వారికి పీఎంఓ షాక్.. నో ఇన్విటేషన్!