Maoists Encounter in Bhadradri : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఛత్తీస్‌గఢ్ - తెలగాణ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఒక యాక్షన్ టీం పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుందనే విశ్వసనీయ సమాచారంతో.. ముందస్తుగా తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి.
ఈ క్రమంలో వడ్డిపేట-పూసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కాల్పులు చేపట్టగా పోలీసులు ఎదురు దాడికి తెగబడ్డారు. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో ఐవోఎస్ కమాండర్ రాజేశ్ ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. మృతి చెందిన ఇద్దరి మావోయిస్టుల మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు
Firing between police and Maoists in Bhadrachalam: మరోవైపు ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ జి. వినిత్ వివరించారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఒక యాక్షన్ టీం పోలీసులపై దాడి చేయాలనే లక్ష్యంతో సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే తమ టీమ్ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు.
కూంబింగ్ నిర్వహిస్తుండగా ఇవాళ ఉదయం 6.10 గంటల సమయంలో పుట్టపాడు అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా.. ఎత్తయిన ప్రదేశం నుంచి మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరపగా.. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రకటించారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల మృత దేహాలు, ఒక ఎస్ఎల్ఆర్ ఆయుధం, ఒక సింగల్ బోర్ తుపాకీతో ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మృతి చెందిన వారిలో ఒకరు చర్ల ఎల్ఓఎస్ కమాండర్ మడకం రాజేశ్‌గా గుర్తించగా.. మరొకరి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
" ఇవాళ ఉదయం పుట్టపాడు(కిష్టారం పీఎస్ పరిధిలో) అటవీ ప్రాంతంలో కొన్ని నిమిషాల పాటు మావోయిస్టులకు,పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. అనంతరం ఎదురు కాల్పులు జరిగిన ప్రదేశంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, ఒక ఎస్ఎల్ఆర్ ఆయుధం, ఒక సింగల్ బోర్ తుపాకీ, ఇతర సామగ్రిని లభించింది. వాటిని సీజ్ చేశాం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించాం. మృతి చెందిన వారిలో ఎర్రయ్య రాజేశ్ ఉన్నారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కూబింగ్ కొనసాగుతోంది." - జి. వినిత్, జిల్లా ఎస్పీ
ఇవీ చదవండి: