భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, సీఆర్పీఎఫ్ 141 బేటాలియన్ సిబ్బంది సంయుక్తంగా కూర్నాపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించగా.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను వెంబడించారు. అందులో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారి నుంచి 10 జిలెటిన్ స్టిక్స్, 2 డిటోనేటర్లు, కార్డేక్స్ వైర్, ఎలక్ట్రిక్ వైర్ స్వాధీనం చేసుకున్నారు.
కోవాసి భీమయ్య డోకూపాడు, ఛత్తీస్గడ్.. సోడి దీపక్ బూరుగుపాడు, చర్ల మండలానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. వారిద్దరూ మూడు సంవత్సరాలుగా అజ్ఞాత సాయుధ సీపీఐ మావోయిస్టు దళానికి కొరియర్లుగా వ్యవహరిస్తూ.. స్థానిక చర్ల ఏరియా మావోయిస్ట్ కమిటీకి అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్నారన్నారు. వీరు నాలుగు నెలల క్రితం చర్ల మండలం, కలివేరు జంక్షన్ వద్ద అమర్చిన మందుపాతరల కేసులో నిందితులుగా ఉన్నారు.
గతేడాది డిసెంబర్లో ఛత్తీస్గడ్ పుట్టపాడులో జరిగిన ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా కూంబింగ్‌కు వచ్చే పోలీసులను హతమార్చాలని ప్రణాళిక వేశారు. సీపీఐ మావోయిస్టు అగ్రనాయకుల ఆదేశాల ప్రకారం వీరిద్దరు.. కుర్నాపల్లి గ్రామస్థుల సహకారంతో అటవీ ప్రాంతంలో మందుపాతర అమర్చేందుకు పేలుడు పదార్థాలతో వచ్చారని పోలీసులు పేర్కొన్నారు. ఆ సమయంలో కూంబింగ్‌లో ఉన్న పోలీసులకు తారసపడగా.. వారిని పట్టుకున్నారు.
ఇదీ చూడండి: స్థానిక సంస్థల నిర్వీర్యానికి ప్రభుత్వాల కుట్ర: జడ్పీటీసీలు