Palvancha Family Suicide: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం సృష్టించిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఇద్దరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి మాధవికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు చేసింది. ఇదే కేసులో వనమా రాఘవకు నిన్న హైకోర్టు బెయిల్ నిరాకరించింది. గత నెలలో వనమా రాఘవతో పాటు సూర్యావతి, మాధవిని పాల్వంచ పోలీసులు అరెస్టు చేసి భద్రాచలం జైలుకు తరలించారు.
అసలు ఏం జరిగిందంటే..
జనవరి 3న భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ నాగ రామకృష్ణ.. అంతకుముందు తీసుకున్న సెల్ఫీవీడియోలో వనమా రాఘవపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అవమానం భరించలేక కుటుంబంతో సహా చనిపోతున్నట్లు రామకృష్ణ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటన బయటికి వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్న రాఘవ ఆచూకీ కోసం పోలీసులు... రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు.. మందలపల్లి అడ్డరోడ్డు వద్ద రాఘవను పోలీసులు పట్టుకున్నారు. గతేడాది వెంకటేశ్వరరావు ఆత్మహత్య కేసులో రాఘవకు నోటీసులు ఇవ్వటం సహా.. రాఘవపై గతంలో నమోదైన కేసులను పోలీసులు వెలికితీస్తున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో వనమా రాఘవను పోలీసులు ఏ-2గా చేర్చారు.
సంచలనమైన సెల్ఫీ వీడియో..
నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో అతని సెల్ఫీ వీడియో సంచలనమైంది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.
"రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగాడు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని కోరాడు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశాడు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు"
- సెల్ఫీ వీడియోలో నాగ రామకృష్ణ ఆవేదన
ఇవీచూడండి: