పోడు భూముల విషయంలో మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దుమ్ముగూడెం మండలం అటవీ భూముల్లో హరితహారం మొక్కలు నాటేందుకుగాను కందకాలు తవ్వేందుకు వెళ్లిన సిబ్బందిని ఆదివాసీలు నిర్బంధించారు. చింతగుప్ప గ్రామం అటవీ భూమికి సంబంధించి స్ట్రెంచ్ కొట్టటానికి దుమ్ముగూడెం ఫారెస్ట్ సిబ్బంది హుస్సేన్, రాజేష్, విజయ్ వెళ్లగా గిరిజనులు వారిని అడ్డుకున్నారు. భూముల్లోకి రావొద్దంటూ అటవీశాఖ సిబ్బందిని చెట్లకు కట్టేసి కర్రలతో కొట్టారు. కొద్దిసేపు నిర్బంధించిన అనంతరం ఆదివాసీలు వారిని విడుదల చేశారు.
వాటి జోలికొస్తే ఊరుకోం..
ఎన్నో ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్నామని వాటి జోలికి వస్తే ఊరుకోమని గిరిజనులు హెచ్చరించారు. అటవీ భూమికి కందకాలు కొట్టేందుకు ప్రయత్నించడాన్ని కొంతకాలంగా ఆదివాసీలు అడ్డుకుంటూనే ఉన్నారు. చింతగుప్ప పరిధిలో 27 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు భూమిని చదును చేశారు. అక్కడికి రోడ్డు నిర్మిస్తున్న క్రమంలోనే గ్రామస్థులు అడ్డుకున్నారు. పోడు భూములను తమ నుంచి దూరం చేస్తున్నారని కడుపుమండిన అడవిబిడ్డలు అటవీశాఖ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.
ప్రభుత్వ ఆదేశాలతోనే..
ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము విధులు నిర్వర్తిస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి త్వరలోనే పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపిస్తారనే ఆశతో అడవిబిడ్డలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చూడండి: చెట్లు కొట్టేసినందుకు రూ.20 లక్షల జరిమానా