Bhadrachalam Districts Protest: రాష్ట్రవిభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన 5 పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలంటూ అఖిలపక్ష నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్యమంలో భాగంగా ప్రధానరోడ్లను ఇవాళ నిర్బంధించారు. నాలుగు సరిహద్దు ప్రాంతాల్లో అఖిలపక్ష నాయకులు సుమారు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించి... వంటావార్పు చేపట్టారు. అనంతరం భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆధ్వర్యంలో 5 గ్రామాల ప్రజలు, అఖిలపక్ష నాయకులు రాస్తారోకో చేపట్టగా... అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఐదు పంచాయితీలను తిరిగి భద్రాచలంలో చేర్చేవరకు ఉద్యమం ఆగదని అఖిలపక్ష పార్టీల నాయకులు స్పష్టంచేశారు.
Bhadrachalam Bandh: రాష్ట్ర విభజనలో ఐదు పంచాయతీలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం వల్ల భద్రాచలం నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అఖిలపక్ష నేతలు గురువారం కూడా ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన అయిదు పంచాయతీలను తిరిగి తెలంగాణలోని భద్రాచలంలో కలపాలని భద్రాచలం నియోజకవర్గ బంద్ పాటిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గురువారం ఉదయం నుంచి అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు భద్రాచలంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. భద్రాచలం నుంచి వెళ్లే అన్ని ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు వ్యాపార సంస్థలను, విద్యా సంస్థలను బంద్ చేయించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రాచలం అభివృద్ధిపై నిర్ణయం తీసుకొని ఐదు పంచాయితీలను తిరిగి భద్రాచలంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: Tollywood drugs case Update : మరోసారి తెరపైకి టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసు