'జనవరి 25నే ఉక్రెయిన్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులు యుద్ధం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అప్రమత్తంగా ఉండాలని.. స్వదేశానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు'. అని ఉక్రెయిన్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన భద్రాచలానికి చెందిన విద్యార్థి మల్లం వివేక్ చెప్పారు. ఉక్రెయిన్- రొమానియా బోర్డర్ దాటేందుకు తమకు సుమారు 3 గంటలు సమయమే పట్టేదని.. కానీ ఇప్పుడు సుమారు 30 గంటల సమయం పడుతోందని తన మిత్రులు చెబుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు మూడు వేల మంది విద్యార్థులు.. రొమానియా దేశ సరిహద్దుల్లో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకు చెందిన మల్లం వెంకటేశ్ కుమారుడు.. వివేక్ 2018లో మెడిసిన్ కోసం ఉక్రెయిన్ వెళ్లారు. ప్రస్తుతం ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. జనవరి 25నే.. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందని ఇండియన్ ఎంబసీ నుంచి హెచ్చరిక వచ్చినట్లు వివేక్ చెప్పారు. కాలేజీ అనుమతి ఇవ్వకపోవడం వల్లే.. అక్కడే ఉండాల్సి వచ్చిందని తెలిపారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో ఫిబ్రవరి 24న ఇండియా వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 23న.. రాత్రి రెండు బస్సుల్లో సుమారు 100 విద్యార్థులు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చేందుకు బయలుదేరామని చెప్పారు. ఫిబ్రవరి 24న.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభం కావడం వల్ల.. ఎయిర్‌పోర్డు మూసివేశారని.. దాంతో తిరిగి యూనివర్సిటీకి వచ్చినట్లు చెప్పారు.
అనంతరం ఇండియ్ ఎంబసీ అధికారులు సూచన మేరకు.. రొమానియా బోర్డర్‌కు చేరుకున్నామని.. అక్కడ నుంచి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానంలో స్వదేశానికి తిరిగొచ్చినట్లు చెప్పారు.
'సుమారు మూడు రోజులు అనేక కష్టాలు పడి ఇండియాకొచ్చాం. ఉక్రెయిన్ నుంచి రొమానియా బోర్డర్‌కు రావడానికి ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. దిల్లీకి వచ్చాక.. కేంద్ర, రాష్ట్ర అధికారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం దిల్లీలోని తెలంగాణ భవన్లో ఆశ్రయం ఇచ్చింది. మంచి భోజనం పెట్టి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. క్షేమంగా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు.'
- మల్లం వివేక్
ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితుల్లో తమ కుమారుడు ఎలా వస్తాడో తెలియక చాలా ఆందోళన చెందినట్లు వివేక్ తల్లితండ్రులు.. మల్లం వెంకటేశ్, మాధవి చెప్పారు. క్షేమంగా ఇంటికి చేర్చినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్పారు.