Sri Rama Navami Thirukalyana Brahmotsavam started: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈరోజు నుంచి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఉగాది పర్వదినం సందర్భంగా లక్ష్మణ సమేత సీతారాములకు విశేషాభిషేకం అర్చకులు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు. బ్రహ్మోత్సవాలకు ఓంకార ధ్వజ ఆరోహణ, విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం, రక్షా సూత్రముల పూజ, రక్షాబంధనం, రుత్విక వరణం కార్యక్రమాలను పూజారులు నిర్వహించారు. తరువాత 118 మంది పండితులకు దీక్ష వస్త్రాలు ఆలయ అధికారులు అందించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం పంచాంగ శ్రవణం జరగనుంది. అనంతరం ప్రతి వ్యక్తి ఈ సంవత్సర ఆదాయ వ్యయాలు తెలపనున్నారు.
గురువారం అగ్ని మథనం కార్యక్రమం: తదుపరి గోవిందరాజు స్వామి వారి ఆలయం నుంచి పుట్ట మట్టిని తీసుకొచ్చి బ్రహ్మోత్సవాలకు సామ్రాజ్య పట్టాభిషేకం, శ్రీరామాయణ మహా క్రతవుకు అంకురార్పణ నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా రేపు ఉదయం అగ్ని మథనం కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇలా ప్రతి రోజు ఏదో ఒక వేడుక నిర్వహిస్తామని ఆలయ వేద పండితులు మురళీ కృష్ణమాచార్యులు తెలిపారు. ఉగాది పండగ అయినందున భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారని ఆలయ అధికారులు తెలిపారు.
"ఉగాది పండగ రోజు ప్రతి వారు ఇంటి మీద ఓంకార ధ్వజాన్ని ఎగర వేయాలని శాస్త్రం చెబుతుంది. ఇలా అందరూ ఆచరిచట్లేదు. ఇది మొదటిసారిగా రాయుడే ఓంకార ధ్వజాన్ని ఎగరవేశారు. విశ్వక్సేన ఆరాధన పుణ్యా వచనం, రక్షా సూత్రముల పూజ, రక్షాబంధనం, రుత్విక వరణం కార్యక్రమాలు జరిగాయి. ఈ రామ క్రతువులో ఎవరెవరూ పాల్గొంటున్నారో ఎవరికి ఏ పని అప్పగించాలో తెలుసుకుని నియమించారు. వారికి యోగ్యతను కలిగేటట్లు పంచకావ్యం ప్రాసన చేసి.. చిన్న చిన్న తప్పులు ఉంటే అవి తొలగేలా చేశారు." -శ్రీమాన్ మురళీ కృష్ణమాచార్యులు, వేద పండితులు భద్రాచలం
శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని గవర్నర్ తమిళి సై, ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానిస్తూ.. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి, పూజారులు కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 30వ తేదీన భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి దంపతులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆహ్వానించారు.
ఇవీ చదవండి: