భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిడారంబరంగా జరుగుతున్నాయి. పవిత్రోత్సవాల్లో రెండో రోజైన ఇవాళ లక్ష్మణ సమేత సీతారాములకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను బేడా మండపం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వివిధ నదీ జలాల పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. స్వామివారికి పవిత్రాలను అలంకరింపజేశారు. ఆలయంలో అనుకోకుండా జరిగే చిన్న చిన్న లోపాలు పవిత్ర ఉత్సవాల ద్వారా పోతాయని ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారికి అలంకరించిన పవిత్రాలను పౌర్ణమి వరకు ఉంచి పౌర్ణమి రోజున పవిత్రాలను తీస్తారు. పవిత్ర ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 4 వరకు ఆలయంలో నిత్య కల్యాణాలు నిలిపివేశారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మితయారు అమ్మవారి సన్నిధిలో లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు.