Singareni Expansion: పొరుగు రాష్ట్రం ఒడిశాలో మరో ప్రతిష్టాత్మక ఉపరితల గనిని సొంతం చేసుకునేందుకు సింగరేణి ప్రయత్నిస్తోంది. ఇటీవల 88 బొగ్గు బ్లాకులకు వేలం పెట్టిన కేంద్రం ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలను పోటీకి ఆహ్వానించిన విషయం విదితమే. వీటిల్లో లాభదాయకంగా భావిస్తున్న ఒడిశాలోని అంగుల్ జిల్లాలో గల ‘బాంఖుయ్’ బ్లాకుకు సింగరేణి పోటీ పడుతోంది. ఆరేళ్ల క్రితం అదే జిల్లాలో నైనీ, రెండేళ్ల క్రితం న్యూపాత్రపద గనులను సింగరేణికి కేంద్రం అప్పగించింది. వీటి సమీపంలోనే పోటీపడుతున్న బ్లాకు ఉంది.
ఏమిటీ ప్రత్యేకత.. ఎంత పోటీ?
బాంఖుయ్ బ్లాకులో బొగ్గు నిక్షేపాలు 800 మిలియన్ టన్నులు ఉంటాయని అంచనా. ఏటా సాలీనా 10 మి.ట. నుంచి 15 మి.ట. బొగ్గును వెలికితీసే అవకాశం ఉంది. జనవరి 20న జరగాల్సిన వేలం కరోనాతో వాయిదా పడింది. ఈ నెలాఖరులో ప్రక్రియ పూర్తికి అవకాశముంది. తమిళనాడుకు చెందిన జెన్కో, ఒడిశాలోని యజ్దాని నుంచి సింగరేణికి పోటీ ఎదురవుతోంది.
ఉద్పాదక వ్యయాన్ని బట్టి నిర్ణయం
"బాంఖుయ్ వేలంలో ఉత్పాదక వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. ఈ బ్లాకును మనం పొందగలిగితే సంస్థ ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది. మన ప్రాంతంలో 6 నుంచి 7 క్యుబిక్ మీటర్ల మట్టి తొలగిస్తే నిక్షేపాలకు చేరువవుతాం. కానీ ఒడిశా ప్రాంతంలో ఇది 2.58 క్యుబిక్ మీటర్లకే పరిమితం. దీంతో ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్నాం. బాంఖుయ్ బ్లాకులో జీ-10 రకం నాణ్యమైన బొగ్గు లభిస్తుందని యాజమాన్యం నిర్ధారణకు వచ్చింది." - చంద్రశేఖర్, డైరెక్టర్(ఆపరేషన్స్), సింగరేణి
ఇదీచూడండి: