కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో 50 బ్లాకులు ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి కార్మిక సంఘాల ఐకాస ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇల్లందు సింగరేణిలోని జేకే 5 ఉపరితల బొగ్గు గని వద్ద చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ... దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కార్మిక సంఘాలకు నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని సంఘాల నాయకులు ఆరోపించారు. నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అరెస్టు చేయడం తగదని ఏఐటీయూసీ కార్మిక సంఘం నాయకుడు సారయ్య అన్నారు. గత కొన్ని రోజులుగా నాయకుల నిర్బంధాలు, అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
ఇదీ చూడండి: 'మన జవాన్లను నిరాయుధులుగా ఎందుకు పంపారు?'