భద్రాచలంలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గోదావరికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మధ్యాహ్నం రెండు గంటలకు గోదావరి నీటిమట్టం 48.3 అడుగులకు చేరింది. జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరికి వరద ఉద్ధృతంగా కొనసాగుతుండటం వల్ల పరివాహక ప్రాంతాల్లోని వాగుల వద్దకు ప్రజలెవరూ వెళ్లకూడదని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రెండ్రోజుల నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోన్న గోదావరి నీటిమట్టం గురువారం ఉదయం నుంచి మళ్లీ పెరగడం ప్రారంభించింది. ఉదయాన్నే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు మధ్యాహ్నం 48.3 అడుగులకు నీటి మట్టం చేరడం వల్ల రెండో ప్రమాద హెచ్చరిక చేశారు. అత్యవసర సేవలకు 08744249994, 08743232444 నంబర్లకు ఫోన్ చేయాలని కలెక్టర్ ఎంవీ రెడ్డి ప్రజలకు సూచించారు.
- ఇదీ చూడండి : వర్షం ఎఫెక్ట్: భద్రాద్రి నుంచి బస్సు సర్వీసులు రద్దు