భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నరసాపురానికి చెందిన ఆర్ఎంపీ ఖాజా పాషా ఓ యువతికి అబార్షన్ చేసి ఆడ శిశువును పొదల్లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఖాజా పాషా ఇంటికి మొన్న ఉదయం ఒక యువతి ఇద్దరు వ్యక్తులు వచ్చి అబార్షన్ చేయాలని కోరారు. ఎక్కువ మొత్తంలో డబ్బు ఆశ చూపటంతో ఆర్ఎంపీ అబార్షన్ అవ్వడానికి మాత్రలు ఇచ్చాడు. కొంత సమయం తర్వాత గర్భిణి ఆడ శిశువుకు జన్మనివ్వగా ఆ శిశువును ముళ్ల పొదల్లో పడేసి ముగ్గురు గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు.
శుక్రవారం ఉదయం స్థానికులు శిశువును గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసు విచారణ చేస్తుండగా అనేక నిజాలు వెలుగులోనికి వచ్చాయి. అతని చుట్టు పక్కల కొన్ని ఇళ్లలో సోదాలు చేయగా లక్షల విలువైన వివిధ రకాల ఔషధాలు, ఇంజెక్షన్లు, అబార్షన్‌కు సంబంధించిన ఇతర పరికరాలు బయటపడ్డాయి.
ఇతను లాక్డౌన్ నేపథ్యంలో అక్రమ మద్యాన్ని కూడా విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. సుమారు రూ.50 వేల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఆర్ఎంపీ, బాలింత మరో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్